ఇళ్లకు కన్నాలేసే ముందు దొంగలు పక్కగా రెక్కీ చేస్తారనే విషయం తెలిసిందే. అలా వారి వివరాలను తెలుసుకుని.. వారు విహారయాత్రలకో, పుణ్యక్షేత్రాలకో వెళ్లినప్పుడు ఇళ్లను కొల్లగొడతారు. అయితే ఈ మధ్య కాలంలో టెక్నాలజీ పెరిగిపోవడంతో.. ఇంటి ఓనర్లు జాగ్రత్త పడుతున్నారు. సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే . ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. వినూత్న పద్ధతుల్లో . తాజాగా ఇలాంటి ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది. ఓ కుటుంబం భద్రాచలం వెళ్లిన విషయం తెలుసుకున్న దొంగలు.. ఆ ఇంట్లో దొంగతనానికి వెళ్లారు. కానీ తెలివిగా ఆలోచించిన ఆ ఇంటి యజమాని.. టెక్నాలజీ దొంగలు దొరికిపోయేలా చేశాడు. ఎరక్కపోయి వచ్చి.. ఇరుక్కుపోయి..సంగారెడ్డి జిల్లా స‌దాశివ‌ మండలం ఆరూర్‌కు చెందిన భరత్ కుమార్.. కుటుంబ సమేతంగా వైకుంఠ ద్వార దర్శనం కోసం సోమవారం భద్రచాలం వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న దొంగలు.. ఇదే అదునుగా చోరికి ప్లాన్ చేశారు. అనంతరం అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి వెళ్లారు ఇద్దరు దొంగలు. ఈ క్రమంలో భద్రాచలం నుంచి తిరిగి వస్తున్న భరత్.. పటాంచెరు వద్ద టీ తాగడానికి ఆగాడు. మంగళవారు (డిసెంబర్ 30) 2 గంటల సమయంలో సాధారణంగా సీసీటీవీ ఫుటేజీని చెక్ చేశాడు.సీసీటీవీలో ఇంట్లో దొంగలు ఉన్న విషయం గుర్తించి ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేశాడు. ఇంటి బయట నుంచి లాక్ చేయమని చెప్పాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో స్థానికులు చోరీ జరిగిన ఇంటి వద్దకు కర్రలతో వెళ్లి బయట నుంచి తాళం వేశారు. పోలీసులు కూడా వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు బద్దలుకొట్టి ఇంట్లోకి వెళ్లారు. అనంతరం ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకున్నారు.చేయి కట్‌ చేసుకున్న దొంగలు.. కాగా, పోలీసులు అదుపులోకి తీసుకునే ముందు దొంగలు విచిత్రంగా ప్రవర్తించారు. స్థానికులు వారిపై దాడి చేయకుండా ఉండేందుకు బ్లేడ్లతో వారి చేతులను కట్ చేసుకున్నారు. దీంతో వారిని వెంటనే పోలీసులు ఆసుపత్రికి తరలించారు. నిందితులను కామారెడ్డి జిల్లాకు చెందిన బోకె మోహన్ (25), చేకూరి విష్ణు (19)గా గుర్తించారు. వీరికి సహాయం చేసిన మరో ఇద్దరు.. ఘటనా స్థలి నుంచి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. అయితే వీరిద్దరు తరచుగా దొంగతనాలు చేస్తుంటారని.. ఇంతకుముందు కూడా చోరీలు చేశారని చెప్పారు. కాగా, భరత్ కుమార్ ఇంట్లో ఇదివరకే దొంగలు పడ్డారు. 10 నెలల తర్వాత సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. ఈ నేపథ్యంలోనే మళ్లీ దొంగతనం జరిగింది.