మూడు రోజుల విరామం తర్వాత తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు శుక్రవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఐదు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టగా.. శాసనసభ వాటికి ఆమోదం తెలిపింది. వీటిలో అత్యధికంగా నాలుగు బిల్లులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా సభ ముందు ఉంచారు. పాలనలో సంస్కరణలు, విద్యా రంగంలో మార్పులే లక్ష్యంగా ఈ సవరణలు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.ప్రవేశపెట్టిన కీలక బిల్లులు..మున్సిపల్ అండ్ జీహెచ్‌ఎంసీ సవరణ బిల్లులు: నగర పాలనలో మరింత పారదర్శకత కోసం తెలంగాణ మున్సిపాలిటీల నాలుగో సవరణ బిల్లుతో పాటు.. జీహెచ్‌ఎంసీకి సంబంధించిన రెండు సవరణ బిల్లులను ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారు. ఇవి స్థానిక సంస్థల అధికారాలు, పరిపాలనా విధివిధానాలను మెరుగుపరచడానికి ఉద్దేశించినవిగా పేర్కొన్నారు. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు: రాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలను పెంచేందుకు, ప్రైవేట్ వర్సిటీల నిర్వహణలో మార్పులు చేస్తూ ఈ బిల్లును ఆమోదించారు.మోటార్ వాహనాల పన్ను సవరణ బిల్లు: రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. వాహనాల పన్నుల క్రమబద్ధీకరణ దీని ప్రధాన ఉద్దేశం.మరోవైపు.. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఈ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించుకుంది. ప్రభుత్వం, స్పీకర్ అనుసరిస్తున్న తీరు ప్రజాస్వామ్య విలువలకి విరుద్ధంగా ఉందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. సభలో ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని, నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని మండిపడుతూ సమావేశాలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించారు. చర్చల్లో తమకు సరైన సమయం ఇవ్వకపోవడం దారుణమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలపై దృష్టి పెడుతుండగా, విపక్షాలు మాత్రం సభ వెలుపల నిరసనలతో తమ గళాన్ని వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. మున్సిపల్ పరిపాలనను పటిష్టం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి శ్రీధర్ బాబు అసెంబ్లీలో పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీలో మెరుగైన సేవల కోసం గ్రేటర్ పరిధిని మూడు కార్పొరేషన్లుగా విభజించే యోచనలో ఉన్నామని, దీనిపై అందరి అభిప్రాయాలు తీసుకుంటామని తెలిపారు. నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు పరిశ్రమలను ఓఆర్‌ఆర్‌ అవతలకు తరలిస్తామని, భవిష్యత్తులో కేవలం ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే తిరిగేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మెట్రో రైలు ప్రాజెక్టును ప్రభుత్వం టేకోవర్ చేసి.. నగరం నలుమూలలా విస్తరిస్తామన్నారు. గత ప్రభుత్వం సిబ్బంది లేకుండానే జిల్లాలను పెంచిందని, తమ ప్రభుత్వం వచ్చాక ఖాళీలను భర్తీ చేస్తోందని వివరించారు. మూసీ పునరుజ్జీవంపై సభ్యుల సూచనలు స్వీకరిస్తామని స్పష్టం చేశారు.