తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్న భక్తుల దాహార్తిని తీర్చడానికి టీటీడీ వినూత్న ఆలోచన చేసింది. భక్తులు అడిగిన వెంటనే తాగునీరు అందించేందుకు ఒక కొత్త పద్ధతిని ప్రవేశపెట్టింది. శ్రీవారి సేవకులు నీటి క్యాన్‌ను వీపున తగిలించుకుని గ్లాసులో నీటిని అందిస్తున్నారు. ఈ ఏర్పాటుతో భక్తులు చాలా సంతోషంగా ఉన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం తర్వాత బయటకు వచ్చే భక్తులకు తాగునీటిని అందించడమే ఈ కొత్త ఏర్పాటు ముఖ్య ఉద్దేశ్యం. టీటీడీ అధికారులు తిరుమలలో ఈ వినూత్నమైన సేవను ప్రారంభించారు. దీనివల్ల భక్తులు ఎండలో ఇబ్బంది పడకుండా వెంటనే నీళ్లు తాగుతున్నారు. ఈ సేవను భక్తులు ప్రశంసిస్తున్నారు.. ఎంతో సౌకర్యంగా ఉందని సంతృప్తిని వ్యక్తం చేశారు. దర్శనం కోసం భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠ ద్వార దర్శనాలు అనుకున్న సమయం కంటే ముందే ప్రారంభం కావడంతో భక్తులు సంతోషించారు. మొదట్లో టోకెన్లు ఉన్నవారికి ప్రాధాన్యత ఇచ్చినా, ఇప్పుడు టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులను కూడా అనుమతిస్తున్నారు. గత నెల 30న ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతున్నాయి. మొదటి మూడు రోజులు ఎస్‌.ఎస్‌.డి టోకెన్లు ఉన్న భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించారు. శిలాతోరణం, కృష్ణతేజ, ఏటీజీహెచ్‌ మార్గాల వద్ద టోకెన్లను స్కాన్‌ చేసి లోపలికి పంపించారు. ఆక్టోపస్‌ భవనం వద్ద నుంచి నారాయణగిరి ఉద్యానవనంలోని క్యూలైన్ల ద్వారా భక్తులను వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-2 లోని కంపార్ట్‌మెంట్లకు తరలిస్తున్నారు. గోవిందనామ స్మరణతో తిరుమల పుణ్యక్షేత్రం మార్మోగుతోంది.వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తుల తాకిడి భారీగా పెరిగింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 1 వరకు మూడు రోజుల్లోనే 33,000 వాహనాలు తిరుమలకు చేరుకున్నాయి. ఈ సమయంలో 1,77,337 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. డిసెంబర్ 30న 67,053 మంది భక్తులు, 31న 70,256 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం సాయంత్రం 5 గంటల వరకు మరో 40,008 మంది భక్తులు స్వామివారి దర్శనం చేసుకున్నారు. డిసెంబరు 30న తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ. 2.25 కోట్లు.. 31న రికార్డు స్థాయిలో రూ. 4.79 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది.తిరుమల శ్రీవారికి మరో భక్తుడు భారీ విరాళం అందించారు. చెన్నైకు చెందిన పొన్నయ నాగేశ్వరన్ అనే భక్తుడు టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీఆర్ నాయుడుకు విరాళం డీడీని అందజేశారు.