హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్.. డీజిల్‌ బస్సులు, ఆటోల స్థానంలో ఈవీలు: సీఎం రేవంత్

Wait 5 sec.

హైదరాబాద్ మహానగరాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. నగరాభివృద్ధిపై సరికొత్త దార్శనికతను ఆవిష్కరిస్తూ.. కోర్-అర్బన్ రీజియన్ ఎకానమీ ఏరియాలో ప్రణాళికాబద్ధమైన పురోగతి సాధించడమే లక్ష్యంగా ఇందులో భాగంగా నగరపాలనను మరింత చేరువ చేసేందుకు 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా పునర్వ్యవస్థీకరించారు. నూతనంగా నియమితులైన జోనల్ కమిషనర్లతో సెంటర్‌లో నిర్వహించిన కీలక సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు.తెలంగాణ రైజింగ్ - 2047 విజన్ డాక్యుమెంట్‌లో భాగంగా హైదరాబాద్ అభివృద్ధిని అత్యంత ప్రాధాన్యతగా ప్రభుత్వం గుర్తించిందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేవలం పరిపాలన మార్పులకే పరిమితం కాకుండా, 'గుడ్ గవర్నెన్స్' నుంచి 'స్మార్ట్ గవర్నెన్స్‌'కు మారాలని అధికారులకు పిలుపునిచ్చారు. జనన మరణ ధ్రువీకరణ పత్రాలు, ట్రేడ్ లైసెన్సులు వంటి పౌర సేవలను ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆన్‌లైన్ ద్వారా పారదర్శకంగా అందించాలని ఆదేశించారు. ఇందుకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా వినియోగించుకోవాలని సూచించారు.నగరంలో చెత్త నిర్వహణ అనేది అత్యంత సంక్లిష్టమైన సమస్యగా మారిందని, దీనిపై జోనల్ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం ఆదేశించారు. రోడ్లపై ఎక్కడా చెత్త కనిపించకూడదు, గుంతలు ఉండకూడదని ఆయన కరాఖండిగా చెప్పారు. ప్రతీ నెలా మూడు రోజుల పాటు శానిటేషన్‌పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని, ప్రతి పది రోజులకోసారి గార్బేజ్ క్లియరెన్స్ చేపట్టాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చడమే లక్ష్యమని.. దశల వారీగా ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధించాలని అధికారులను ఆదేశించారు. నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు కోర్ అర్బన్ ఏరియాలో డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు, ఆటోలను ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. నగర జీవనాడి అయిన చెరువులు, నాలాల పరిరక్షణపై ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆక్రమణలను అరికట్టేందుకు చెరువులు, నాలాలు, డంపింగ్ ఏరియాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. హైడ్రా, జీహెచ్ఎంసీ, వాటర్ వర్క్స్ విభాగాల సమన్వయంతో జనవరి నుంచే నాలాల పూడికతీత పనులు ప్రారంభించాలని డెడ్ లైన్ విధించారు. వీధి దీపాల నిర్వహణలో ఎక్కడా లోపాలు ఉండకూడదని, అధికారులు నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని దిశానిర్దేశం చేశారు.అభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేయడం కోసం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్లు, అపార్ట్‌మెంట్ అసోసియేషన్లతో నిరంతరం కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. టోల్ ఫ్రీ నంబర్‌కు వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించే యంత్రాంగం ఉండాలని చెప్పారు. దోమల నివారణ, అంటువ్యాధులు ప్రబలకుండా ముందుస్తు చర్యలు తీసుకోవడం ద్వారా నగర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు తదితర ఉన్నతాధికారులు పాల్గొని, నగర అభివృద్ధికి కార్యాచరణ రూపొందించారు.