భారత్-పాకిస్తాన్ మధ్య 2025 మే నెలలో జరిగిన సైనిక ఘర్షణలను () తామే మధ్యవర్తిత్వం వహించి.. సద్దుమణిగించామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరచూ చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతుండగా.. ఇప్పుడు చైనా కూడా అదే విధమైన ప్రకటన చేసింది. అయితే ఈ వాదనలను భారత్ తీవ్రంగా ఖండించింది. బీజింగ్‌లో జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సులో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మాట్లాడుతూ.. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా జరిగిన పలు వివాదాలను పరిష్కరించడంలో చైనా కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. మయన్మార్, ఇరాన్ అణు సమస్యలతో పాటు భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను కూడా చైనా తన మధ్యవర్తిత్వం ద్వారా తగ్గించిందని ఆయన వెల్లడించారు. పొరుగు దేశాలతో చైనా సంబంధాలు కొత్త దశకు చేరుకున్నాయని.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆగస్ట్‌లో టియాంజిన్‌లో జరిగిన ఎస్‌సీఓ సమ్మిట్‌కు ఆహ్వానించడం ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.చైనా వాదనలను భారత విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. మే 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరిగిన ఘర్షణలు కేవలం ఇరు దేశాల డీజీఎంఓల మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల ద్వారానే ముగిశాయని స్పష్టం చేసింది. మే 10వ తేదీన జరిగిన ఫోన్ కాల్ ద్వారానే కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని.. ఇందులో మూడో దేశం ప్రమేయం ఏమాత్రం లేదని భారత్ పునరుద్ఘాటించింది.చైనా ద్వంద్వ నీతిపై విమర్శలుఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా శాంతి మంత్రం పఠిస్తూనే.. మరోవైపు పాకిస్తాన్‌కు భారీగా ఆయుధాలను సరఫరా చేసిందని భారత సైనిక వర్గాలు ఆరోపించాయి. చైనా తన ప్రాచీన యుద్ధ నీతి 36 వ్యూహాలను అమలు చేస్తూ.. పాకిస్థాన్ అనే అరువు కత్తితో భారత్‌ను దెబ్బతీయాలని చూసిందని లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్. సింగ్ విమర్శలు గుప్పించారు. ఈ ఘర్షణను చైనా తన ఆయుధాల సామర్థ్యాన్ని పరీక్షించుకోవడానికి ఒక లైవ్ ల్యాబ్‌లా వాడుకుందని భారత్ ధ్వజమెత్తింది.