ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ లైఫ్ ట్యాక్స్‌పై కీలక ప్రకటన చేసింది. కొత్త వాహనాలపై జీవిత పన్ను (లైఫ్‌ ట్యాక్స్‌) పెరగలేదని.. కేవలం దానిపై అదనంగా 10 శాతం రోడ్‌ సేఫ్టీ సెస్‌ మాత్రమే విధిస్తున్నామని తెలిపింది. లైఫ్ ట్యాక్స్‌ను మరో 10 శాతం పెంచినట్లు కాదని వివరణ ఇచ్చింది. ఈ అదనపు సెస్‌ను రోడ్డు ప్రమాదాల నివారణ, రహదారుల అభివృద్ధి కోసమే వినియోగిస్తామని తెలిపింది. ఉదాహరణకు.. లక్ష రూపాయల విలువైన బైక్‌పై ప్రస్తుతం 12 శాతం (రూ.12వేలు) జీవిత పన్ను ఉంది. ఇప్పుడు దానిపై అదనంగా 10 శాతం (రూ.1,200) రోడ్‌ సేఫ్టీ సెస్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఇది వాహనాలపై మొత్తం పన్ను భారాన్ని గణనీయంగా పెంచదని రవాణాశాఖ వివరించింది.కొత్తగా వాహనాలు కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడు వాటి ధర ఆధారంగా లైఫ్ చేస్తారు. ఈ పన్ను కనిష్ఠంగా 9 శాతం నుంచి గరిష్ఠంగా 18 శాతం వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ జీవిత పన్నుపై మాత్రమే 10 శాతం అదనంగా రోడ్‌ సేఫ్టీ సెస్‌ విధిస్తున్నారు. ఇటీవల వరకు లక్ష రూపాయల విలువైన బైక్‌పై 28 శాతం జీఎస్టీ ఉండేది. సెప్టెంబరు నుంచి ఇది 18 శాతానికి తగ్గింది. అంటే జీఎస్టీ రూపంలో రూ.10వేలు ఆదా అవుతుంది. అయితే, జీవిత పన్నుపై అదనంగా విధించిన రోడ్‌ సేఫ్టీ సెస్‌ రూపంలో కేవలం 1,200 రూపాయలు మాత్రమే అదనపు భారం పడుతుందని రవాణాశాఖ తెలిపింది. ఈ కొత్తగా వసూలు చేయనున్న రోడ్‌ సేఫ్టీ సెస్‌ మొత్తాన్ని పూర్తిగా రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి అవసరమైన చర్యలు చేపట్టడానికి, రహదారుల అభివృద్ధి పనులకే ఉపయోగిస్తామని రవాణాశాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ సెస్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజల భద్రత కోసమే ఖర్చు చేస్తామని హామీ ఇచ్చారు.ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కొత్త మోటారు వాహనాలపైవసూలు చేసే జీవిత పన్నులో 10 శాతం చొప్పున 'రహదారి భద్రత సెస్‌'ను ప్రవేశపెట్టడానికి ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపింది. ఇటీవల కేంద్రం మోటారు వాహనాలపై విధించే జీఎస్టీని 28 శాతం నుండి 18 శాతానికి తగ్గించింది. దీనివల్ల వాహనాల ధరలు తగ్గుముఖం తగ్గాయి. కొనుగోలుదారులు ఇప్పుడు తక్కువ ధరకే వాహనాలు కొనుగోలు చేయగలుగుతున్నారు. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ చిన్న సెస్‌ వాహన యజమానులపై పెద్దగా భారం మోపదని అధికారులు చెబుతున్నారు. ఈ ఆర్డినెన్స్‌తో, రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయం సమకూరుతుంది. నెలకు సుమారు రూ.22.5 కోట్లు, అంటే సంవత్సరానికి రూ.270 కోట్లు ఈ సెస్‌ ద్వారా వస్తుందని అంచనా. ఈ ఆదాయాన్ని రహదారి భద్రతా చర్యల కోసం వినియోగించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ప్రయాణికుల భద్రతను పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.