ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు న్యూ ఇయర్ వేళ శుభవార్త చెప్పింది. ఈ మేరకు డిస్కంలకు చెల్లించాల్సిన ట్రూఅప్ మొత్తాన్ని ప్రజలపై ఎలాంటి భారం పడకుండా ప్రభుత్వం భరించాలని నిర్ణయించింది. Fourth Controlled Period (2019-20 నుంచి 2023-24 వరకు)కు సంబంధించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏపీఈఆర్‌సీ (రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి)కి లేఖ రాసింది. ఈ నిర్ణయంతో ప్రజలకు రూ.4,497.89 కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారం తప్పింది. గత ఐదేళ్లలో వివిధ పేర్లతో ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం ఉంది. ప్రజలు ఇప్పటికీ ప్రతి నెలా బిల్లులో వాటిని చెల్లిస్తున్నారు. అయితే చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చారు. ఆ హామీకి అనుగుణంగానే ప్రభుత్వం రూ.వేల కోట్ల ట్రూఅప్ భారాన్ని పూర్తిగా భరించింది.కమిషన్ (APERC) ప్రతిపాదనలను పూర్తిగా అంగీకరించలేదు. ముఖ్యంగా, క్యారీయింగ్‌ కాస్ట్‌ కింద ప్రతిపాదించిన రూ.4,149.70 కోట్లను, ట్రాన్స్‌మిషన్‌ ఖర్చు, ఇతర సర్దుబాట్లు రూ.217.89 కోట్లను కలిపి, మొత్తంగా రూ.8,274.07 కోట్ల వసూళ్లకు కమిషన్ అనుమతి నిరాకరించింది. అయితే, డిస్కంలు చేసిన ప్రతిపాదనల్లో కొన్నింటిని కమిషన్ ఆమోదించింది. అనుమతించని ఖర్చులు పోను రూ.5,933.44 కోట్లు ట్రూఅప్ కింద వసూలు చేసుకునేందుకు కమిషన్ అనుమతి ఇచ్చింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం సర్దుబాటు చేసిన రూ.1,435.55 కోట్లు పోను, ట్రూఅప్ కింద రూ.4,497.89 కోట్లు వసూలు చేసుకునేందుకు డిస్కంలకు అనుమతిస్తూ కమిషన్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం, డిస్కంలు ప్రజల నుంచి విద్యుత్ బిల్లుల రూపంలో కొంత మొత్తాన్ని అదనంగా వసూలు చేసుకోవచ్చు.ఏపీలో యూనిట్ విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని 2029 నాటికి రూ.4 లోపు తీసుకురావాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు సీఎస్ విజయానంద్‌. విజయవాడలో బుధవారం జరిగిన విద్యుత్ సంస్థల డైరీ, క్యాలెండర్ల ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎస్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో, ఈపీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్, సీపీడీసీఎల్, నెడ్‌క్యాప్, ఏపీ సోలార్‌ పవర్‌ కార్పొరేషన్‌లకు సంబంధించిన డైరీలు, క్యాలెండర్లను ఆయన ఆవిష్కరించారు. '2024-25 ఆర్థిక సంవత్సరంలో యూనిట్ విద్యుత్ కొనుగోలు వ్యయం రూ.5.19 ఉంటే.. 2025-26 నాటికి దానిని రూ.4.90కు తగ్గింది. ఈ కొనుగోలు వ్యయం యూనిట్‌కు 29 పైసలు తగ్గడం వల్లనే ఛార్జీలను తగ్గించాము. నవంబర్ బిల్లులో యూనిట్‌కు 13 పైసల చొప్పున ఛార్జీలు తగ్గాయి. 2026-27 ఆర్థిక సంవత్సరానికి యూనిట్ కొనుగోలు వ్యయాన్ని రూ.4.60కు తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము' అన్నారు సీఎస్ విజయానంద్.