New Gas Cylinder Rates: లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కొత్త సంవత్సరం వేళ షాక్ తగిలింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్, డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ కొత్త రేట్లను చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించాయి. ఇక్కడ 2025 సంవత్సరంలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. అయితే కొత్త సంవత్సరం వేళ 2026, జనవరి 1న భారీగా పెంచేశాయి. ప్రాంతాల్ని బట్టి ఇది రూ. 110-111.50 వరకు పెరిగింది. 47.5 కేజీల ఒకేసారి రూ. 276.50 పెరిగింది. .. గ్యాస్ సిలిండర్ ధరల్ని ప్రతి నెలా ఒకటో తేదీన సవరిస్తుంటాయి. ఇప్పుడు జనవరి నెలకు సంబంధించి రేట్లను ప్రకటించాయి. నేటి నుంచే కొత్త రేట్లు అమల్లోకి వస్తాయి. హైదరాబాద్ నగరంలో ఇప్పుడు రూ. 111 పెరిగింది. దీంతో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర నగరంలో రూ. 1801.50 నుంచి ఒక్కసారిగా రూ. 1912.50 కి చేరింది. ఇదే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో చూస్తే రూ. 111 పెరిగి రూ. 1642.50 కి ఎగబాకింది. చెన్నైలో ఇది రూ. 1849.50 గా ఉంది. ఇక్కడ తాజాగా రూ. 110 చొప్పున పెరిగింది. న్యూ ఢిల్లీలో కూడా రూ. 111 పెరిగి వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 1691.50 కి చేరింది. ఇప్పుడు ఒక్కసారిగా పెరిగినప్పటికీ.. గతేడాది మాత్రం భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. మార్చి నుంచి చూస్తే 8 నెలలు రేటు తగ్గగా.. 2 నెలలు అది కూడా స్వల్పంగా పెరిగింది. మార్చి 1న హైదరాబాద్‌లో ఈ గ్యాస్ సిలిండర్ రేటు రూ. 2029.50 వద్ద ఉండగా.. ఇప్పుడు రూ. 1912.50 కి చేరింది. ఈ క్రమంలో భారీగానే తగ్గిందని చెప్పొచ్చు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు.. ఎక్కువగా వ్యాపార సంస్థలు, హోటళ్లు, రెస్టారెంట్లు, వీధి వ్యాపారులు వినియోగిస్తుంటారు. దీంతో ఇక్కడ ఆహార పదార్థాల ధరల్ని పెంచే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా.. ఇంట్లో వినియోగించే గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఇది సామాన్యులకు కాస్త ఊరటనిచ్చే అంశం. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ రేటు రూ. 905 గా ఉంది. ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్‌పై రూ. 300 సబ్సిడీ వర్తిస్తుంది. ఏడాదికి 9 రీఫిల్స్ చేసుకోవచ్చు. అంటే వీరికి సిలిండర్ ధర రూ. 605 పడుతుందన్నమాట. చివరగా ఇది 2025, ఏప్రిల్ 1న ఈ వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 50 మేర పెరిగింది. తర్వాత మళ్లీ మారలేదు. అయితే దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో చూస్తే హైదరాబాద్‌లోనే గ్యాస్ సిలిండర్ రేట్లు అధికంగా ఉంటాయని చెప్పొచ్చు. హైదరాబాద్ కంటే చెన్నై, ముంబై, ఢిల్లీలోనే రేట్లు తక్కువగా ఉన్నాయి.