ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు కావడంతో ఆర్టీసీ కూడా తన డిపోలను జిల్లాల వారీగా విభజించింది. కొత్తగా రెండు జిల్లాలు ఏర్పడటంతో పాటు, కొన్ని జిల్లాల్లో మార్పులు, చేర్పులు జరిగాయి. దీనికి అనుగుణంగా ఆర్టీసీ కూడా తన డిపోలను జిల్లాల వారీగా పునర్వ్యవస్థీకరించింది. మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. పోలవరం జిల్లాలో ఒక్క డిపో కూడా లేదని, మార్కాపురం జిల్లా పరిధిలో పొదిలి, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు డిపోలు వస్తాయని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ మార్పులన్నీ బుధవారం నుంచి అమలులోకి వస్తాయని ఆదేశాల్లో తెలియజేశారు.కొత్తగా ఏర్పడిన పోలవరం, మార్కాపురం జిల్లాలకు జిల్లా ప్రజారవాణాశాఖ అధికారి (డీపీటీవో) పోస్టులను ప్రభుత్వం సృష్టించింది. పోలవరం జిల్లాకు తూర్పుగోదావరి డీపీటీవో వైఎస్‌ఎన్‌ మూర్తి, మార్కాపురం జిల్లాకు ప్రకాశం డీపీటీవో జి.సత్యనారాయణ అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మార్పులతో రంపచోడవరం బస్టాండ్ పోలవరం జిల్లా పరిధిలోకి వచ్చింది. అలాగే, అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చారు.రంపచోడవరం బస్‌స్టాండ్‌ ఇంతకాలం అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో ఉండేది. ఇప్పుడు పోలవరం జిల్లా ఏర్పడటంతో, ఈ బస్టాండ్‌ను తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరం డిపో మేనేజర్‌కు అనుబంధంగా మార్చారు. ఇది రవాణా సేవలను మరింత మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చారు. గత ఆరు నెలలుగా చిత్తూరు డీపీటీవో రాము అన్నమయ్య జిల్లా డీపీటీవోగా బాధ్యతలు చూస్తున్నారు. ఇప్పుడు ఆయన మదనపల్లె కేంద్రంగానే ఆ జిల్లా రవాణా వ్యవహారాలను పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మార్పులు జిల్లా ప్రజలకు రవాణా సేవలను మరింత సులభతరం చేస్తాయని అధికారులు తెలిపారు.మార్కాపురం జిల్లా పరిధిలో.. మార్కాపురం, గిద్దలూరు, పొదిలి, కనిగిరి డిపోలు ఉన్నాయి. రాష్ట్రంలో కొత్తగా జరిగిన మార్పులతో పోలవరం జిల్లాలో ఒక్క ఆర్టీసీ డిపో కూడా లేకుండా పోయింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు డిపో ఒక్కటే మిగిలింది. విజయనగరం జిల్లాలో విజయనగరం, ఎస్‌.కోట అనే రెండు డిపోలు ఉన్నాయి. అలాగే అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి, నర్సీపట్నం అనే రెండు డిపోలు ఉన్నాయి. అత్యధికంగా డిపోలు ఉన్న జిల్లా తిరుపతి.. ఇక్కడ మొత్తం 10 డిపోలు ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో కడప, నంద్యాల, అనంతపురం, నెల్లూరు జిల్లాలు ఉన్నాయి. ఈ నాలుగు జిల్లాల్లో ఒక్కో జిల్లాకు ఏడు డిపోలు చొప్పున ఉన్నాయి. మొత్తం మీద కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆర్టీసీ డిపోల్లో కూడా మార్పులు జరిగాయి. బుధవారం నుంచి రెండు కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభమైన సంగతి తెలిసిందే.