గజ గజా వణుకుతున్న తెలంగాణ.. రికార్డు స్థాయికి పడిపోయిన ఉష్ణోగ్రతలు

Wait 5 sec.

తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం గతంలో ఎన్నడూ లేని విధంగా అక్టోబరు చివర నుంచే మొదలైన చలి.. డిసెంబరు నాటికి పతాక స్థాయికి చేరింది. అటు ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఇటు మైదాన ప్రాంతాల వరకు జనం గజగజ వణికిపోతున్నారు. సాధారణంగా జనవరి రెండో వారం తర్వాత ఉండాల్సిన చలి తీవ్రత ఈసారి ముందే రావడం విశేషం.రాష్ట్రవ్యాప్తంగా దాదాపు సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి మెదక్, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 6 నుంచి 8 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. కోహిర్, సిర్పూర్ వంటి ప్రాంతాల్లో గత 25 రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు 6 డిగ్రీలకు అటూఇటుగా ఉండటం అక్కడి వాతావరణ తీవ్రతకు అద్దం పడుతోంది. నగర శివారు ప్రాంతాల్లోనూ పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ 8 నుండి 12 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి.వాతావరణ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. ఈ ఏడాది చలి తీవ్రత పెరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. గత 20 రోజులుగా హిమాలయాల నుంచి వీస్తున్న అతి శీతల గాలులు నేరుగా దక్షిణాది వైపు మళ్లడం, పసిఫిక్ మహాసముద్రంలో చోటుచేసుకున్న లానినో ప్రభావం వల్ల శీతాకాలం సాధారణం కంటే కఠినంగా మారింది. ఇటీవలి భారీ వర్షాల వల్ల జలాశయాలు నిండి ఉండటం, అల్పపీడనాలు లేకపోవడంతో ఆకాశం నిర్మలంగా ఉండి వాతావరణంలో తేమ తగ్గడం వల్ల రాత్రిపూట భూమి త్వరగా చల్లబడుతోంది.సాధారణంగా హిమాలయాలకు చేరువలో ఉండే ఉత్తరాది రాష్ట్రాల్లో కనిపించే ఇలాంటి పరిస్థితులు, దక్షిణాదిలో నెలకొనడం అరుదని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే 3 నుండి 5 డిగ్రీల వరకు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. చలి తీవ్రత నుంచి తమను తాము కాపాడుకునేందుకు ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచించారు.