న్యూ ఇయర్ వేళ జపాన్‌ను వణికించిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6 తీవ్రతతో కంపించిన భూమి

Wait 5 sec.

జపాన్‌ తూర్పు నోడా ప్రాంత తీరంలో బుధవారం రిక్టర్ స్కేలుపై 6 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించినట్లు అమెరికా జియాలాజికల్ సర్వే వెల్లడించింది. జపాన్ వాసులు 2026 నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమవుతున్న సమయంలో ఈ భూకంపం సంభవించడం తీవ్ర ఆందోళన కలిగించింది. భూకంప కేంద్రం నోడా నగరానికి తూర్పున 91 కిలోమీటర్ల దూరంలో.. సముద్ర మట్టానికి 19.3 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భూకంప కేంద్రం లోతు తక్కువగానే ఉన్నప్పటికీ.. తాజా సమాచారం ప్రకారం ఎటువంటి సునామీ హెచ్చరికలు జారీ కాలేదు. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే డిసెంబర్ 8వ తేదీన 7.5 తీవ్రతతో సంభవించిన పెను భూకంపం దాదాపు 90 వేల మంది ప్రజలను నిరాశ్రయులను చేసింది. ఆ తుఫాను ధాటికి కనీసం 30 మందికి పైగా గాయాల పాలయ్యారు. 7.5 తీవ్రతతో సంభవించిన తుఫాను కారణంగా.. ఆ సమయంలో సుమారు 3 మీటర్ల ఎత్తున సునామీ అలలు రావచ్చని అక్కడి అధికారులు కూడా భారీ హెచ్చరికలు జారీ చేశారు. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉండటం వల్ల ప్రపంచంలోనే అత్యంత భూకంప ప్రభావిత దేశంగా జపాన్ నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సంభవించే 6.0 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రత కలిగిన భూకంపాల్లో దాదాపు 20 శాతం జపాన్ పరిసరాల్లోనే సంభవిస్తుంటాయని వెల్లడైంది.