ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఆ భూముల్ని దర్జాగా అమ్ముకోవచ్చు, ప్రభుత్వం కీలక నిర్ణయం

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు పట్టా భూములకు నిషేధిత జాబితా నుంచి విముక్తి లభించనుంది. గత ప్రభుత్వం రీసర్వే సమయంలో సర్వీసు ఈనాం/ఈనాం భూములను 22ఏ జాబితాలో చేర్చడంతో సమస్యలు ఎదురయ్యాయి. కూటమి ప్రభుత్వం ఈ భూములను వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించింది. రెవెన్యూ ప్రక్షాళనలో భాగంగా ఈ 22ఏ భూముల సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు మార్గదర్శకాలను త్వరలో విడుదల చేయనుంది. గతంలో ప్రైవేటు పట్టా భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చడంతో, వాటిని తొలగించడానికి అధికారులు అనేక రకాల పత్రాలు అడుగుతూ రైతులను ఇబ్బంది పెట్టేవారు. ఇకపై ఇలా పదిసార్లు తిరగాల్సిన అవసరం ఉండదు. అర్జీలు తిరస్కరించరు. 22ఏ జాబితాలో ఉన్న భూముల సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ శాఖలో 22ఏ సమస్య వెంటాడుతోంది. లక్షలాది ఎకరాలు నిషేధిత జాబితాలో చేరడంతో.. ప్రతి జిల్లాలోనూ బాధితులున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. ఈ 22ఏ సమస్యపై చాలా మంది తమ బాధలను చెప్పుకుంటూ అర్జీలు పెట్టుకున్నారు. అయితే ఆ అర్జీల్లో 95 శాతం కంటే ఎక్కువ ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ సమస్య శ్రీకాకుళం, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఈ జిల్లాల్లోని రైతులు, భూ యజమానులు ఈ 22ఎ సమస్యతో చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ భూముల సమస్యలు కొలిక్కి వస్తే క్రయ, విక్రయాలకు లైన్ క్లియర్ అవుతుంది. తొలగించాలంటే.. మాజీ లేదా ప్రస్తుత సైనికులైతే, వారికి సంబంధించిన పత్రాలను సమర్పించిన వెంటనే 22ఎ(1)(ఎ) నుంచి తొలగిస్తారు. రాజకీయ బాధితుల విషయంలో, వారి పత్రాలను పరిశీలించాలి లేదా కలెక్టరేట్‌లోని ఎసైన్‌మెంట్‌ మాస్టర్‌ రిజిస్టర్‌ను చూడాలి. అక్కడ వారి పేరు ఉంటే, 22ఎ(1)(ఎ) నుంచి తొలగింపు జరుగుతుంది. స్వాతంత్య్ర సమరయోధులైతే, వారికి సంబంధించిన పత్రాలు లేదా కలెక్టరేట్‌లోని స్వాతంత్య్ర సమరయోధుల మాస్టర్‌ రిజిస్టర్స్‌ ఆఫ్‌ ఎసైన్‌మెంట్‌ను పరిశీలించాలి. అక్కడ వారి రికార్డులు ఉంటే, వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగిస్తారు. అలాగే, 1954 జూన్ 18 కంటే ముందు భూమి కేటాయించినట్లు రుజువులుంటే, ఆ భూములను కూడా 22ఎ జాబితా నుంచి తొలగించాలనే నిబంధన ఉంది. ఈ ప్రక్రియ ద్వారా అర్హులైన వారి భూములకు విముక్తి లభిస్తుంది.గ్రామ సర్వీస్ ఈనాం భూముల సమస్యను ప్రభుత్వం పరిష్కరించనుంది. దాదాపు 1.37 లక్షల ఎకరాల ఈనాం భూములు ప్రస్తుతం వివాదాల్లో ఉన్నాయి. ఈ భూములకు సంబంధించి ప్రభుత్వం పరిష్కార మార్గాలను రూపొందిస్తోంది. ఇప్పటికే జారీ చేసిన రైత్వారీ పట్టాలు చెల్లుబాటు అవుతాయని.. అన్ని రెవెన్యూ రికార్డుల్లో పట్టాదారులను, వారి వారసులను లేదా కొనుగోలుదారులను నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. రీసర్వే రికార్డుల్లో కూడా ఈ వివరాలను చేర్చాలి. 2013 చట్టానికి ముందు రైత్వారీగా మార్చిన భూములను 310 జీవో ద్వారా తిరిగి రైత్వారీగా పునరుద్ధరించారు. వీటిని మళ్లీ 22ఏ జాబితాలో చేర్చకూడదు.రీసర్వే సమయంలో సర్వీసు ఈనాం, ఈనాం భూములను 22ఏ జాబితాలో చేర్చినట్లయితే, అధికారులు స్వచ్ఛందంగా వాటిని తొలగించాలి. 2023 జులై 19న జారీ చేసిన 310 జీవోలో నిర్దేశించిన విధంగానే వ్యవహరించాలని స్పష్టం చేసింది. ఒక సర్వే నంబరులోని కొంత భాగం మాత్రమే నిషేధిత భూమి అయినప్పటికీ, మొత్తం సర్వే నంబరును నిషేధిత జాబితాలో చేర్చడం సరికాదని, ఈ పరిస్థితిని వెంటనే సరిదిద్దాలని ప్రభుత్వం సూచించింది. అవసరమైన చోట వెంటనే సబ్‌డివిజన్ చేసి, నిషేధిత భూమి ఎంత ఉందో అంత విస్తీర్ణానికే జాబితా పరిమితం చేయాలని, మొత్తం సర్వే నంబరును చేర్చకూడదని ఆదేశించింది.సైనికులు, రాజకీయ బాధితులు, స్వాతంత్య్ర సమరయోధుల వంటి వారికి కేటాయించిన భూములకు సంబంధించిన పత్రాల విషయంలో అధికారులు అనవసరంగా ఒత్తిడి చేయకూడదు. భూమి కేటాయింపులకు సంబంధించిన ఎసైన్‌మెంట్‌ మాస్టర్‌ రిజిస్టర్లు, జిల్లా సైనిక సంక్షేమ అధికారి సిఫారసుల రిజిస్టర్‌ వంటివి ముఖ్యమైనవి. అలాగే, పాత రెవెన్యూ రికార్డులైన 10(1) రిజిస్టర్, అడంగల్స్, ఎస్‌ఎఫ్‌ఏ వంటివి కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఎసైన్‌మెంట్‌ రిజిస్టర్లు, డీఆర్‌ దస్త్రాలు, రికార్డు ఆఫ్‌ హోల్డింగ్స్‌ (ఆర్‌ఓహెచ్‌) కూడా భూమి హక్కులను నిరూపించడానికి ఉపయోగపడతాయి. రిజిస్ట్రేషన్‌ పత్రాలు, సర్వే, సబ్‌డివిజన్‌లకు సంబంధించిన 8ఏ రిజిస్టర్లు, డీకేటీ పట్టాలు కూడా భూమి యాజమాన్యాన్ని ధృవీకరించడానికి కీలకమైనవి. ఈ పత్రాలలో ఏదో ఒకటి ఉన్నా సరిపోతుంది అంటున్నారు.చుక్కల భూములను 22ఏ జాబితా నుంచి తొలగించిన తర్వాత, వాటిని మళ్లీ ఆ జాబితాలో చేర్చడం సరికాదని అధికారులు తెలిపారు. ఒకవేళ పొరపాటున చేర్చినా, అధికారులు వెంటనే వాటిని తొలగించాలి. ఇది భూ యజమానులకు ఊరట కలిగించే అంశం. గతంలో పరిష్కరించిన భూములకు సంబంధించి కూడా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రీసర్వే సమయంలో కొన్ని భూములను మళ్లీ చుక్కల భూములుగా, అనాధీన భూములుగా, లేదా షరతులు గల పట్టా భూములుగా మార్చినట్లయితే, గతంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం వాటిని యథాస్థితికి తీసుకురావాలని ఆదేశించింది. అలాగే, ప్రైవేటు పట్టా భూములను 22ఏ జాబితాలో చేర్చినప్పుడు, ఎవరూ ఫిర్యాదు చేయకపోయినా, అధికారులు స్వయంగా వాటిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వం సూచించింది. ఈ చర్యలన్నీ భూ యజమానులకు న్యాయం చేకూర్చే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలుగా చెప్పవచ్చు.