కొత్త ఏడాది కొద్ది గంటల్లో ప్రారంభం కానుండగా.. ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను విడుదల చేసింది. పెండింగ్‌ బిల్లుల్లో డిసెంబరు నెలకు సంబంధించి రూ.713 కోట్లు డిసెంబరు 31న (బుధవారం) విడుదలయ్యాయి. బకాయిలపై ఉద్యోగ సంఘాలకు గతంలో ఇచ్చిన హామీ ప్రకారం తాజాగా నిధులు విడుదల చేశారు. ప్రతి నెల రూ.700 కోట్ల చొప్పున విడుదల చేస్తామని కాంగ్రెస్ సర్కారు మాట ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క డిసెంబరు నెల నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు.ఉద్యోగులకు కొన్నేళ్లుగా గ్రాట్యుటీ, జీపీఎఫ్, సరెండర్‌ లీవ్‌లు, అడ్వాన్స్‌లకు సంబంధించిన బకాయిలు భారీగా పేరుకుపోయాయి. ఈ మొత్తం దాదాపు రూ.10 వేల కోట్లకు చేరింది. ఈ విషయమై ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వినతులు, విజ్ఞాపనలు చేశాయి. సమస్య పరిష్కారం కాకపోవడంతో జూన్‌లో ఆందోళనకు సిద్ధపడ్డాయి. దీంతో నెలకు రూ.700 కోట్ల చొప్పున విడుదల చేస్తామని ప్రభుత్వం అదే నెలలో ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌ నెలాఖరులో మొదటి విడతగా రూ.183 కోట్లు విడుదల చేసింది. అనంతరం ఆగస్టు నుంచి నెలకు రూ.700 కోట్ల చొప్పున విడుదల చేస్తూ వస్తోంది.కాగా, రెండు రోజుల కిందట తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగా.. సభలో ఉద్యోగులు పెండింగ్ బిల్లులు బకాయిలపై మాజీ మంత్రి టీ హరీశ్‌రావు ప్రస్తావించారు. డీఏలు, పీఆర్సీ, సీపీఎస్ నుంచి ఓపీఎస్, పదవీ విరమణ ఉద్యోగుల సెటిల్‌మెంట్ కూడా పెండింగ్‌లో ఉన్నాయని ఆయన లేవనెత్తారు. ఈహెచ్‌ఎస్ అమలు కావడం లేదని ఆయన ఆరోపించారు. సిద్ధిపేటకు చెందిన ఓ వెటర్నరీ డాక్టర్ అక్టోబర్ 2024లో రిటైర్ అయితే ఇప్పటివరకు ఒక్క పైసా రాలేదని తనకు చెప్పారని అన్నారు. తక్షణమే ఇచ్చిన హామీ ప్రకారం బకాయిలు విడుదల చేయాలని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కోరారు. అయితే, దీనికి మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ.. బీఆర్ఎష్ ప్రభుత్వం పదేళ్లుగా ఉద్యోగులకు జీతాలను 20 తేదీకి ఇచ్చేదని, తాము 5వ తేదీకే చెల్లిస్తున్నామని అన్నారు.