Jewellers IPO: హైదరాబాద్ కేంద్రంగా బంగారం, వెండి సహా ఇతర ఆభరణాల వ్యాపారం నిర్వహిస్తోన్న ప్రముఖ జువెలరీ సంస్థ దీపా జువెలర్స్ స్టాక్ మార్కెట్లలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. తొలి పబ్లిక్ ఆఫర్ (IPO) ద్వారా నిధులు సమీకరించేందుకు అనుమతించాలని కోరుతూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI)కి ప్రాస్పెక్టస్ (DRHP) దాఖలు చేసింది. సెబీ నుంచి అమనుతి రాగానే సబ్‌స్క్రిప్షన్, లిస్టింగ్ తేదీలు ప్రకటించనుంది. మరి ఆ వివరాలు తెలుసుకుందాం. దీపా జువెలర్స్ లిమిటెడ్ కంపెనీ రూ. 250 కోట్లు సమీకరించాలనే లక్ష్యంగా పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. రూ.2 ఫేస్ వాల్యూ విలువ గల ఈక్విటీ షేర్లను జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పబ్లిక్ ఇష్యూలో భాగంగా దీపా జువెలర్స్ ప్రమోటర్లు ఆశిష్ అగర్వాల్, సీమా అగర్వాల్ లు సంయుక్తంగా 1,18,48,340 ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయిస్తున్నారు. అలాగే ఫ్రెస్ షేర్ల జారీ సైతం ఉంటుందని దీపా జువెలర్స్ తెలిపింది. ఈ తాజా షేర్ల జారీ ద్వారా సమకూరే నిధులను కంపెనీ నిర్వహణ మూల ధన అవసరాలకు కేటాయిస్తామని తెలిపింది. ఈ నిధులను కంపెనీ దీర్ఘకాలిక మూలధన అవసరాలకు ఉపయోగిస్తామని కంపెనీ తెలిపింది. ఈ ఇష్యూ అనేది సెబీ ఐసీడీఆర్ రెగ్యులేషన్స్ కి అనుగుణంగా, బుక్- బిల్డింగ్ ప్రాసెస్ ద్వారా జరగనుందని దీపా జువెలర్స్ తెలిపింది. ఈ ఐపీఓలో 50 శాతం షేర్లను క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్లు, 15 శాతం వరకు నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు, 35 శఆతం వరకు రిటైల్ ఇండివిడ్యూయల్ ఇన్వెస్టర్లకు కేటాయిస్తున్నట్లు పేర్కొంది. 2016లో హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటైన ఈ కంపెనీ బంగారు ఆభరణాల డిజైన్, తయారీ, విక్రయాలు చేపడుతోంది. 2024- 25లో ఈ కంపెనీ రూ. 1397 కోట్ల ఆదాయం ఆర్జించింది. దీనిపై రూ.40.5 కోట్ల నికర లాభాన్ని అందుకుంది. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో కంపెనీ ఆదాయం రూ. 812 కోట్లు అందుకోగా దానిపై రూ. 48.6 కోట్ల నికర లాభాన్ని అందించింది. ఈ పబ్లిక్ ఇష్యూ గురించిన పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే సబ్‌స్క్రిప్షన్‌లో పాల్గొని బిడ్లు దాఖలు చేయాలి. తొలిసారి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారు వీటి జోలికి వెళ్లకపోవడమే మంచిదని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.