భారత రక్షణ మంత్రిత్వ శాఖ రూ.79,000 కోట్ల విలువైన ఆయుధాల కొనుగోలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ముఖ్యంగా, దేశీయంగా అభివృద్ధి చేసిన సుదూర లక్ష్యాలను ఛేదించే ఆయుధాలు, డ్రోన్లను అడ్డుకునే వ్యవస్థలపై ఈ కొనుగోలు ప్రక్రియలో కీలక ప్రాధాన్యత ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ నుంచి నేర్చుకున్న పాఠాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా సరిహద్దులు దాటి దాడులు చేయాల్సిన అవసరం ఏర్పడింది. అమెరికా నుంచి నావికాదళం కోసం మరో రెండు ఎంక్యూ9బీ 'సీ గార్డియన్' డ్రోన్లను లీజుకు తీసుకునే ప్రతిపాదనకు కూడా ఈ సందర్భంగా ఆమోదం లభించింది.రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని రక్షణ సేకరణ మండలి ఆమోదం తెలిపిన ఈ ప్రతిపాదనలలో, దేశీయంగా తయారుచేసే గైడెడ్ పినాకా రాకెట్ సిస్టమ్స్, అస్త్ర ఎయిర్-టు-ఎయిర్ మిస్సైల్ పొడిగించిన వెర్షన్ ఉన్నాయి. ఈ మిస్సైల్స్ ఎక్కువ దూరం నుంచి శత్రు విమానాలను కూల్చివేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని అధికారులు తెలిపారు. ఈ రాకెట్లు సరిహద్దుల లోపల ఉన్న కీలక లక్ష్యాలను సమర్థవంతంగా ఛేదించగలవని అధికారులు వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్‌ సమయంలో గుర్తించిన దాని ప్రకారం.. పాకిస్తాన్ వద్ద ఉన్న చైనా తయారీ ఆయుధాలను ఎదుర్కోవడానికి ఇండియాకు ఎక్కువ దూరం ప్రయాణించే ఎయిర్-టు-ఎయిర్ మిస్సైల్స్ అవసరం ఉందని గుర్తించారు.సైన్యం కోసం, ఇంటిగ్రేటెడ్ డ్రోన్ డిటెక్షన్ అండ్ ఇంటర్‌డిక్షన్ సిస్టమ్ Mk-II అనే మరో దేశీయ వ్యవస్థను కూడా కొనుగోలు చేయనున్నారు. ఈ వ్యవస్థ డ్రోన్లను గుర్తించి, వాటిని అడ్డుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది కీలకమైన ఆస్తులను, సరిహద్దుల్లోనూ, దేశం వెలుపల కూడా రక్షించడానికి ఉపయోగపడుతుంది. సైన్యం కోసం, చిన్న చిన్న లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించడానికి దేశీయంగా అభివృద్ధి చేసిన లోయిటరింగ్ మ్యునిషన్స్ కూడా కొనుగోలు చేయనున్నారు. అలాగే, చిన్నగా ఉండి, తక్కువ ఎత్తులో ఎగిరే డ్రోన్లను గుర్తించడానికి, ట్రాక్ చేయడానికి తక్కువ ఎత్తులో పనిచేసే తేలికపాటి రాడార్లను కూడా సైన్యం అందుకోనుంది.నావికాదళం కోసం, హై-ఫ్రీక్వెన్సీ సాఫ్ట్‌వేర్ డిఫైన్డ్ రేడియోలు (HF SDRs) వంటి అనేక ప్రతిపాదనలకు మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. హై-ఆల్టిట్యూడ్ లాంగ్-ఎండ్యూరెన్స్ డ్రోన్లను లీజుకు తీసుకునేందుకు కూడా అనుమతి లభించింది. ఈ డ్రోన్లు నిరంతర నిఘా, గూఢచార సమాచార సేకరణకు, హిందూ మహాసముద్ర ప్రాంతంలో మెరుగైన సముద్ర నిఘా సామర్థ్యానికి దోహదపడతాయని ఒక అధికారి తెలిపారు.అలానే వాయుసేన కోసం, అస్త్ర మిస్సైల్స్‌తో పాటు, ఆటోమేటిక్ టేకాఫ్ ల్యాండింగ్ రికార్డింగ్ సిస్టమ్స్, SPICE-1000 లాంగ్-రేంజ్ గైడెన్స్ సిస్టమ్స్ కూడా కొనుగోలు చేయనున్నారు. ఇవి సరిహద్దుల అవతల ఉన్న లక్ష్యాలను చాలా దూరం నుంచి ఖచ్చితంగా ఛేదించడానికి వాయుసేనకు సహాయపడతాయి. ఈ కొనుగోళ్లు దేశ రక్షణ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతాయి.