హైదరాబాద్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పునర్విభజన తరహాలోనే.. నగర భద్రతా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు పోలీసు కమిషనరేట్ల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేసింది. ప్రస్తుతం ఉన్న మూడు కమిషనరేట్లకు అదనంగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న 'ఫ్యూచర్ సిటీ' కోసం ప్రత్యేకంగా నాలుగో కమిషనరేట్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రాంతాలన్నింటినీ జీహెచ్‌ఎంసీలో విలీనం చేసిన నేపథ్యంలో.. పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న నగరానికి అనుగుణంగా పోలీసు శాఖలో ఈ భారీ మార్పులు చోటుచేసుకున్నాయి.ప్రభుత్వం 'ఫ్యూచర్ సిటీ' కమిషనరేట్ ఏర్పాటు ఈ పునర్విభజనలో ప్రధానమైన అంశం. గతంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్న ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్‌పల్లి, ఆమన్‌గల్లు వంటి ప్రాంతాలను కలిపి ఈ కొత్త కమిషనరేట్‌ను రూపొందించారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా ప్రపంచస్థాయి హబ్‌గా మారనుండటంతో అక్కడి భద్రత, శాంతిభద్రతల పర్యవేక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ అవసరమని ప్రభుత్వం భావించింది. ప్రస్తుతానికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచే ఈ కొత్త కమిషనరేట్ కార్యకలాపాలు తాత్కాలికంగా ప్రారంభం కానున్నాయి.మరోవైపు ప్రస్తుతం ఉన్న రాచకొండ కమిషనరేట్ పేరును 'మల్కాజిగిరి కమిషనరేట్‌'గా మార్చారు. దీని పరిధిలోకి సికింద్రాబాద్, కంటోన్మెంట్, కీసర, శామీర్‌పేట, కుత్బుల్లాపూర్, కొంపల్లి వంటి ప్రాంతాలతో పాటు బోయినపల్లి, కార్ఖానా, తిరుమలగిరి పోలీస్ స్టేషన్లను చేర్చారు. అలాగే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిని అటు శంషాబాద్, ఇటు రాజేంద్రనగర్ వరకు విస్తరించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా భౌగోళికంగా కొన్ని మార్పులు చేస్తూ సరిహద్దులను పునర్‌వ్యవస్థీకరించారు. వీటితో పాటు భువనగిరిని ప్రత్యేక పోలీస్ జిల్లాగా మార్చడం గమనార్హం.ఈ పునర్విభజనతో పాటు కీలకమైన ఐపీఎస్ అధికారుల బదిలీలను కూడా ప్రభుత్వం చేపట్టింది. కొత్తగా ఏర్పాటైన ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ తొలి సీపీగా సుధీర్‌బాబు బాధ్యతలు చేపట్టనుండగా.. మల్కాజిగిరి సీపీగా అవినాశ్‌ మహంతి, సైబరాబాద్ సీపీగా రమేశ్‌రెడ్డి నియమితులయ్యారు. యాదాద్రి ఎస్పీగా అక్షాంశ్‌ యాదవ్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ నూతన పోలీసు వ్యవస్థ ద్వారా నగరంలో నేరాల నియంత్రణ మరింత సులభతరం అవుతుందని, ముఖ్యంగా కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు పోలీసు సేవలు మరింత చేరువవుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.