ఆంధ్రప్రదేశ్ కేబినెట్ దగదర్తి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయం తీసుకుంది. నెల్లూరు జిల్లా దామవరం గ్రామంలో 418.14 ఎకరాల భూమిని సేకరించడానికి రాష్ట్ర ఎయిర్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌కు అనుమతి మంజూరు చేసింది. శాశ్వత లీజ్‌ హోల్డర్లకు ఎకరాకు రూ.13 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది. దగదర్తి సమీపంలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణం వేగంగా ముందుకు సాగుతోంది. భూసేకరణకు సంబంధించిన సమగ్ర నివేదికను కలెక్టర్ హిమాన్షు శుక్లా ప్రభుత్వానికి సమర్పించారు. ఈ భూసేకరణ ప్రక్రియ పూర్తయితే, జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరనుంది. ఇప్పటికే విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ ప్రారంభమైంది. త్వరలోనే కాంట్రాక్టర్ల ఎంపిక పూర్తవుతుంది. ఈ విమానాశ్రయం పూర్తయితే, నెల్లూరు జిల్లా పారిశ్రామిక, పర్యాటక రంగాలకు కొత్త జోష్ నింపుతుందని చెబుతున్నారు. ప్రయాణికుల రవాణాతో పాటు సరుకు రవాణా కూడా పెరుగుతుంది అంటున్నారు. అంతేకాదు కడప, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల ప్రజలకు, అక్కడి పరిశ్రమలకు ఈ విమానాశ్రయంతో ప్రయోజనం ఉంటుంది. మొదటి దశ పనులు ప్రారంభం కానున్నాయి. ఏపీఏడీసీఎల్‌ (రాష్ట్ర విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ లిమిటెడ్‌) ఈ ప్రాజెక్టును పీపీపీ (ప్రైవేట్-పబ్లిక్ పార్ట్‌నర్‌షిప్) విధానంలో చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు దీనికి సంబంధించిన టెండర్ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. నిర్మాణ సంస్థతో 15 ఏళ్లపాటు అమలులో ఉండేలా రాయితీ ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఈ అభివృద్ధిని ప్రతి 15 ఏళ్లకు ఒక దశగా విభజించారు. ప్రతి దశలోనూ మూలధన ఖర్చుతో పాటు, భవిష్యత్తులో పెరిగే ప్రయాణికుల రద్దీ, కార్గో సేవలకు అనుగుణంగా ఏర్పాట్లను సర్దుబాటు చేయాలని ప్రతిపాదించారు. మొదటి 15 ఏళ్లలో ప్రయాణికుల రద్దీ తక్కువగా ఉంటుందని.. ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ, మూడో దశలో గరిష్ఠస్థాయికి చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఈ కొత్త విమానాశ్రయం నుంచి ప్రారంభంలో ఎయిర్‌బస్‌ ఎ-320/ఎ-321 వంటి మీడియం సైజు విమానాలను నడపాలని ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం ఒక రన్‌వే నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేశారు. పీపీపీ విధానం అంటే ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ సంస్థలు కలిసి పెట్టుబడి పెట్టి, విమానాశ్రయాన్ని నిర్మించి, నిర్వహించే ప్రాజెక్టు.. ఇలా చేస్తే ఎయిర్‌పోర్ట్ వేగంగా పూర్తవుతుందని చెబుతున్నారు. ఈ దగదర్త విమానాశ్రయం అందుబాటులోకి వస్తే నెల్లూరు జిల్లాలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయంటున్నారు. మొత్తం మీద నెల్లూరు జిల్లా నిర్మాణ దిశగా కీలక ముందడుగు పడిందని చెప్పాలి.