తెలుగు రాష్ట్రాల మధ్య అత్యంత రద్దీగా ఉండే సంక్రాంతి ప్రయాణాలను సులభతరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకోబోతోంది. పండుగ రోజుల్లో టోల్‌గేట్ల వద్ద వాహనాలు గంటల తరబడి నిలిచిపోకుండా ఉండేందుకు.. ఆ మూడు నాలుగు రోజుల పాటు టోల్ వసూళ్లను పూర్తిగా నిలిపివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI)కు, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాయాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నిర్ణయించారు. దీనిపై చర్చించేందుకు మంగళవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది.ప్రతి ఏటా .. భాగ్యనగరం నుండి ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లే ప్రయాణికులకు టోల్ కష్టాలు తప్పవు. ముఖ్యంగా పంతంగి, కొర్లపహాడ్ చిల్లకల్లు వంటి టోల్ ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరుతుంటాయి. ఫాస్టాగ్ సౌకర్యం ఉన్నప్పటికీ.. వాహనాల సంఖ్య లక్షల్లో ఉండటంతో ఒక్కో టోల్ ప్లాజా దాటడానికి గంటల సమయం పడుతోంది. పండుగకు వెళ్లే ఉత్సాహంలో ఉన్న సామాన్యులకు ఈ ట్రాఫిక్ జామ్‌లు నరకాన్ని చూపిస్తున్నాయి. చంటిపిల్లలు, వృద్ధులతో ప్రయాణించే వారు ఈ రద్దీలో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు ఏటా కనిపిస్తూనే ఉన్నాయి.ప్రస్తుతం ఈ జాతీయ రహదారిపై పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది. వివిధ చోట్ల ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, వంతెనలు, సర్వీసు రోడ్ల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. నిర్మాణ పనుల కారణంగా రహదారిపై ఇప్పటికే అనేక చోట్ల మళ్లింపులు ఉన్నాయి. సాధారణ రోజుల్లోనే వాహనాలు నెమ్మదిగా సాగుతుండగా.. ఇక పండుగ రద్దీ తోడైతే ట్రాఫిక్ సమస్య మరింత జటిలమయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. టోల్ వసూళ్ల కోసం వాహనాలను ఆపితే.. ఆ రద్దీ వెనక్కి కిలోమీటర్ల మేర విస్తరించి హైవే అంతా స్తంభించిపోయే ప్రమాదం ఉంది.ఈ క్లిష్ట పరిస్థితిని గమనించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. ప్రజలకు ఊరటనిచ్చేలా టోల్ మినహాయింపు అంశాన్ని తెరపైకి తెచ్చారు. టోల్ గేట్ల నిర్వహణను తాత్కాలికంగా నిలిపివేస్తే వాహనాలు ఆగకుండా సాఫీగా సాగిపోతాయని తద్వారా ఇంధనం ఆదా అవ్వడమే కాకుండా ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా కలెక్టర్లు, పోలీస్, ఆర్‌అండ్‌బీ అధికారులతో నిర్వహించే సమావేశంలో ఈ ప్రతిపాదనపై స్పష్టత రానుంది. కేంద్ర ప్రభుత్వం గనుక దీనికి సానుకూలంగా స్పందిస్తే.. ఈ ఏడాది సంక్రాంతి ప్రయాణం సామాన్యులకు ఎంతో హాయిగా మారనుంది.