ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీశక్తి పథకం కింద మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. అయితే గుర్తింపు కార్డు నిబంధన తొలగించాలని ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయూ) కోరింది. ఉచిత బస్సు పథకాన్ని ఉపయోగించుకుంటున్న మహిళల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు పెద్దగా లేనందున.. గుర్తింపు కార్డు చూపించాలనే నిబంధనను తొలగించాలని ఎంప్లాయీస్‌ యూనియన్‌ (ఈయూ) ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినతిపత్రం అందజేసింది. ఈయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పలిశెట్టి దామోదరరావు, జీవీ నరసయ్య ఈ విషయాన్ని తెలిపారు. ఈ మార్పు వల్ల కండక్టర్లపై ఒత్తిడి తగ్గి, బస్సు ఎక్కిన ప్రతి మహిళకు సులభంగా స్త్రీశక్తి పథకం టికెట్ ఇవ్వొచ్చన్నారు.అమలు తర్వాత రద్దీ పెరిగిందని.. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ సొంతంగా 3,000 బస్సులు కొనుగోలు చేసి.. 10వేల మందిని నియమించాలని ఈయూ కోరింది. ప్రభుత్వ సహకారంతో విద్యుత్ బస్సులను కొనుగోలు చేసి నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది. సంస్థలో పనిచేస్తున్న 8వేలమంది పొరుగుసేవల ఉద్యోగులకు తగిన ఉద్యోగ భద్రత కల్పించాలని కూడా ఈయూ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోసియేషన్‌ (ఎన్‌ఎంయూఏ)కు చెందిన న్యూ ఇయర్ క్యాలెండర్‌ను అమరావతిలో ఆవిష్కరించారు. ఏపీ జేఏసీ ఛైర్మన్‌ విద్యాసాగర్‌తోపాటు, ఎన్‌ఎంయూఏ రాష్ట్ర అధ్యక్షులు వై.శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు శ్రీనివాసరాజు ఆధ్వర్ంయలో క్యాలెండర్‌ ఆవిష్కరించారు.వచ్చే ఏడాదిలో స్వర్ణాంధ్ర సాధన కోసం ప్రభుత్వ ఉద్యోగులు మరింత ఉత్సాహంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని, రాష్ట్రాభివృద్ధిలో వారి భాగస్వామ్యం కీలకమన్నారు. ఉద్యోగుల డిమాండ్లపై పూర్తి అవగాహనతో ఉన్నామని, దశలవారీగా అన్ని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తూనే ఉద్యోగుల హక్కులను కాపాడేలా నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఏపీఎన్జీవో, ఏపీ జేఏసీ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సీఎం చంద్రబాబును కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలు టీచర్లు, ఉద్యోగ సంఘాల డైరీలు, క్యాలెండర్లను సీఎం ఆవిష్కరించారు. ఉద్యోగినులకు ఛైల్డ్‌ కేర్‌ లీవ్‌ వయోపరిమితి తొలగింపు, ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతులపై వెంటనే ఉత్తర్వులు ఇవ్వడం వంటి అంశాలపై సంఘాల నాయకులు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.రూ.25 కోట్లతో షేర్డ్‌ సర్వీస్‌ సెంటర్లుపట్టణాల్లో మున్సిపల్ షేర్డ్ సర్వీస్ సెంటర్ల ఏర్పాటు కోసం ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.25 కోట్లను విడుదల చేసింది. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు, మున్సిపల్ ఆస్తుల సంరక్షణ, ఆదాయ సమీకరణ వంటి అంశాల్లోనూ ఈ సెంటర్లు కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ షేర్డ్ సర్వీస్ సెంటర్ల ఏర్పాటు ద్వారా పట్టణాల్లో పౌరులకు అందించే సేవలను మరింత సులభతరం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. వివిధ రకాల ప్రభుత్వ సేవలను ఒకే చోట అందుబాటులోకి తీసుకురావడం దీని ముఖ్య ఉద్దేశ్యం. మున్సిపల్ ఆస్తులను సమర్థవంతంగా నిర్వహించడం, వాటి ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడం వంటి పనులను కూడా ఈ సెంటర్లు చేపడతాయి. దీనివల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా కూడా మేలు జరుగుతుంది. ఈ నిధుల విడుదలకు సంబంధించి పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకే ఈ కేటాయింపులు జరిగాయి.