‘మాస్ జాతర’ మూవీ రివ్యూ: మాట తప్పావయ్యా రవితేజా

Wait 5 sec.

సూడండ్రా అబ్బాయిలు.. గత కొన్నేళ్లుగా ఫ్లాప్ సినిమాలు తీసి మీకు చిరాకు దొబ్బించాను. ‘మాస్ జాతర’తో హిట్టు కొడుతున్నాం.. ఫిక్స్ అయిపోండి అని చాలా కాన్ఫిడెన్స్‌గా ఫ్యాన్స్‌కి మాట ఇచ్చారు మాస్ రాజా రవితేజ. ఆయనకి పెద్దగా యాంటీ ఫ్యాన్స్ వార్ ఉండదు కాబట్టి.. సినిమా ఓ మోస్తరుగా ఉన్నా కూడా లాక్కొచ్చేస్తుంటుంది. చాలామందిలో రవితేజ అంటే మనోడే అన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి.. ఆయన ధీమాగా చెప్పడంతో ‘మాస్ జాతర’పై కాస్తో కూస్తో నమ్మకం అయితే కలిగింది. మరి ఇచ్చిన మాటని రవితేజ నిలబెట్టుకున్నాడా? గత కొన్నాళ్లుగా చిరాకు పెట్టించిన రవితేజ ఈ సినిమాతో మాస్ ఆడియన్స్‌కి జాతర చూపించాడో లేదో రివ్యూలో చూద్దాం. కొన్ని కొన్ని ట్యాగ్స్ హీరోలకు బలవంతంగా అతికించినట్టుగా ఉంటాయి కానీ.. ‘మాస్’అనే మాట రవితేజ ఇంటి అడ్రస్ లెక్క. మాస్‌రాజా రవితేజా సినిమా ఏదైనే సరే.. అతని ఫ్యాన్స్‌కి ‘మాస్ జాతరే’. అలాంటి మాస్ జాతరనే సినిమా పేరుగా పెట్టుకుని ఈసారి ఏ మాత్రం నిరుత్సాహ పరచను.. పక్కాగా హిట్ కొడుతున్నాం అని ధీమాగా చెప్పిన రవితేజ నమ్మకాన్ని నిలబెట్టలేకపోయారు దర్శకుడు భాను భోగవరపు. మాస్ జాతర ట్రైలర్ చూసినప్పుడు ఎలా ఉందని అడిగితే యాజిటీజ్ అలాగే ఉందనే కామెంట్లు వినిపించాయి. కొత్తగా ఏం అనిపించలేదు. పైగా రవితేజ పోలీస్ డ్రెస్ వేస్తే.. చాలా సినిమాల్లో చూసినగెటప్పే కదా.. ఈ మీసం తిప్పుడూ మాస్ ఎలివేషన్స్‌ రవితేజకి అలవాటైన గెటప్పూ.. సెటప్పూ అనేట్టుగానే అనిపించాయి. కానీ.. ట్రైలర్ చూసి సినిమాని అంచనా వేయలేం కదా.. కథలో ఏదైనా కొత్త విషయం ఉండొచ్చు అని ఆశపడ్డవాళ్లకి ఎదురుచూపులే మిగిలేట్టుగా ‘మాస్ జాతర’ని రొటీన్ జాతరగా మార్చేశారు.సాధారణం పోలీస్ నేపథ్యంలోని కథలన్నీ ఇంచుమించు ఒకేలా ఉంటాయి. హీరో డ్యూటీ మీద ఓ ఏరియాకి వెళ్తాడు. అక్కడో పరమ దుర్మార్గమైన విలన్ ఉంటాడు. చివరికి ఆ విలన్‌ని హీరో మట్టుపెడతాడు. ఎటు నుంచి ఎటు తిప్పినా.. ముగింపు అయితే ఇదే. కాబట్టి తెలియని కథ కంటే.. తెలిసిన కథని ప్రేక్షకుడికి ఆసక్తిగా చెప్పడం అనేది ఇంకా కష్టం. ఏ మాత్రం తేడా కొట్టినా కూడా రొటీన్ అనే పెదవివిరుపులు వచ్చేస్తుంటాయి. అందులోనూ మాస్ రాజ రవితేజ సినిమాలంటే.. పైగా పోలీస్ పాత్ర అంటే.. ఎక్కడో చూసినట్ట ఉందే అని ఫీలింగ్‌ వెంటాడేస్తాయి. అలాంటప్పుడు ఎంతో జాగ్రత్తగా కథని డీల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ.. కొత్త దర్శకుడు భాను భోగవరపు ఈ సినిమా పాటలో చెప్పినట్టుగా.. ‘రిథమ్ లేదు.. కథం లేదు.. పదం లేదు.. అర్ధం లేదు.. పర్ధం లేదు’ అంటూ చివరికి పాత కథతోనే ఫ్రెష్‌గా పాత్రలు మార్చి మళ్లీ చూపించారు. లక్షణ్ భేరి (రవితేజ) ఓ రైల్వే పోలీస్. వరంగల్‌లో ఓ పొలిటీషియన్ కొడుకుని కొట్టి అడవివరం అనే ఏజెన్సీ ఏరియాకి ట్రాన్స్ ఫర్ అవుతాడు. అక్కడ శివుడు (నవీన్ చంద్ర) గంజాయి పంట పండిస్తూ.. కలకత్తాకి స్మగ్లింగ్ చేస్తుంటాడు. ప్రభుత్వ పెద్దల అండదండలూ.. పోలీస్ వ్యవస్థ అతని కనుసన్నల్లో ఉండటంతో ఆ ప్రాంతం అంతా శివుడు కంట్రోల్‌లోనే ఉంటుంది. అలాంటి ప్రాంతానికి వెళ్లి.. శివుడ్ని మట్టుపెట్టడానికి లక్ష్మణ్ భేరి ఎలాంటి రిస్క్ చేశాడన్నదే ‘మాస్ జాతర’ కథా.. కథనం. మాస్ రాజా రవితేజ ఐకానిక్ మూమెంట్స్‌ని సెలబ్రేట్ చేసుకునేలా ఆయన పాత సినిమాల రిఫరెన్స్‌లను బాగా వాడుకున్నారు దర్శకుడు. మాస్ రాజా పూనకం వచ్చినట్టే చేశారు యాక్షన్ ఎపిసోడ్‌లలో. సాధారణంగా శ్రీలీల ఉందంటే.. డాన్స్ అద్దరేస్తుందని అనుకుంటాం. కానీ.. ‘మాస్ జాతర’ రవితేజ ఎనర్జీతో ఆమెను డ్యామినేట్ చేశారు. ఈ వయసులో కూడా ఎంత ఎనర్జీ ఏంట్రా సామీ అనేట్టుగా.. పాటల్లో చెలరేగిపోయారు రవితేజ. ఇడియట్ లోని రవితేజని గుర్తు చేస్తూ.. నాటి సిగ్నేచర్ మూమెంట్స్‌తో మాస్ ఆడియన్స్‌‌తో విజిల్స్ వేయించారు. యాక్షన్ ఎపిసోడ్స్‌ చాలా మాసీగా అనిపిస్తాయి. రవితేజకి యాక్షన్ పాటు.. కామెడీ టైమింగ్ కూడా కుమ్మేస్తారు. ఇందులో ఆయన శక్తికి మించి కామెడీ చేసే ప్రయత్నం చేసినా.. వర్కౌట్ అయ్యే స్టఫ్ కంటెంట్‌లో కనిపించలేదు. ‘సామజవరగమన’ లాంటి రొమాంటిక్ కామెడీ సినిమాతో రైటర్‌గా మంచి మార్కులు వేయించుకున్న భాను భోగవరపు.. దర్శకుడిగా పరిచయం కావాలని ప్రయత్నాలు మొదలుపెట్టినప్పుడు.. చాలామంది ఆయన్ని అడిగిన మాట.. మంచి మాస్ కథ ఉంటే చెప్పవయ్యా అని. మాస్ కథ అంటే మాస్ రాజా రవితేజ గుర్తొస్తారు కాబట్టి.. అలాంటి కథ రాసి చివరికి ఆయనకే చెప్పారు భాను భోగవరపు. సాధారణంగా కథ రాసే విధానంలో చాలా లెక్కలు ఉంటాయి. కథ రాసి.. దానికి సెట్ అయ్యే హీరోని వెతకడం.. లేదా పలానా హీరోని అనుకుని అతనికి సెట్ అయ్యేలా కథ రాయడం. రవితేజ విషయంలో రెండు ఫార్ములానే ఫాలో అయ్యారు దర్శకుడు. రవితేజని దృష్టిలో పెట్టుకునే ఈ కథ రాశారు. రవితేజ ఆల్రెడీ పోలీస్ సినిమాలు కొన్ని చేశారు కాబట్టి... అందుకే కొత్తగా ఉండేలా ఈ రైల్వే పోలీస్ కథని రాసుకున్నారు. కథ ఎలా రాసినా కూడా.. ఆ కథని ఎంత ఎంగేజింగ్‌గా చెప్పాం అన్నదే ముఖ్యం. రవితేజకి కథ చెప్పి ఒప్పించడంలో సక్సెస్ అయిన దర్శకుడు.. ఆ కథని తెరపై ఆవిష్కరించడంలో మాత్రం సక్సెస్ కాలేకపోయారు. రవితేజ ఫ్యాన్స్ ఎలాంటి యాక్షన్ ఎపిసోడ్‌లను కోరుకుంటారో.. వాటిపై మాత్రమే దృష్టిపెట్టిన దర్శకుడు కథ కోర్ ఎమోషన్‌ని పండించలేకపోయారు. పేక ముక్కలు పేర్చినట్టుగా.. హీరో ఎంట్రీ, యాక్షన్ ఎలిమెంట్స్, ఓ పాటా.. మరో ఫైటూ.. ఇలా పేర్చుకుంటూ మర్షియల్ మీటర్ ఫార్ములా ఫాలో అయిపోయారు. ఎంత కమర్షియల్ సినిమా అయినా ఎమోషనల్ టచ్ ఉంటేనే.. తెరపై కనిపించే భావోద్వేగాలను చూసే ప్రేక్షకుడు ఫీల్ అయితేనే ఆ కథతో జర్నీ చేస్తాడు. ‘మాస్ జాతర’లో కనిపించే పాత్రకీ పాత్రకీ కనెక్టివిటీ కుదరకపోవడంతో.. అది ఆడియన్స్‌కి కనెక్ట్ కాలేకపోయింది. హీరో రైల్వే పోలీస్ కావడానికి చెప్పిన చూపించిన నేపథ్యం సీరియస్‌గా అనిపించదు. అలాగే ఈ సినిమాలో కోర్ ఎమోషన్ అంటే.. తాత, మనవడి పాత్రలతోనే. ఆ పాత్రల్లో రాజేంద్రప్రసాద్, రవితేజలు సూట్ కాలేదు. రాజేంద్రప్రసాద్‌.. ఈ సినిమా హిట్ కాకపోతే ఇండస్ట్రీ వదిలేసి వెళ్లిపోతాను అంటూ స్టేట్‌మెంట్‌లు ఇచ్చేశారు కానీ.. ఆ పాత్ర ఎబ్బొట్టుగా అనిపిస్తుంది. కామెడీ కోసం ఏదో ట్రై చేసినా.. ఎమోషన్స్ పండించాల్సిన చోట సరిగా పండలేదు. పోనీ హీరోయిన్ శ్రీలీలతో హీరో ఎఫెక్షన్ అయినా కుదిరిందా అంటే.. అంత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఆమెను చూడగానే చొంగ కార్చుకుంటూ వెనకపడటం కథలో సీరియస్ నెస్‌ని తగ్గించినట్టుగా అనిపిస్తుంది. పోనీ ఆమె అసలు రంగు బయటపడిన తరువాత.. ఆమెను మార్చుకునే ప్రయత్నం హీరో చేశాడా అంటే అది లేదు. ఓ సెంటిమెంట్ సీన్ పెట్టేసి ఇద్దర్నీ కలిపేసినట్టుగానే అనిపిస్తుంది. ఆ సెంటిమెంట్ సీన్ కూడా.. కావాలని ఇరికించినట్టుగా అనిపిస్తుంది. తులసి పాత్రలో గతంలో కంటే కాస్త మెరుగైన పాత్ర చేసిందంతే శ్రీలీల. డాన్స్‌లు బాగా చేస్తుందనే ఒకే ఒక్క కారణంతోనే ఆమెకి అవకాశాలు క్యూ కడుతున్నాయో ఏమో కానీ.. అబ్బా అనిపించేంత గొప్పగా అయితే లేదు. ఆమె లిస్ట్‌లో జూనియర్, రాబిన్ హుడ్, గుంటూరు కారం, ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్, ఆది కేశవ, భగవంత్ కేసరి, స్కంధ.. ఇప్పుడు ‘మాస్ జాతర’ చేరింది. గ్యాంగ్ లీడర్‌‌లో చిరంజీవి-విజయశాంతి మధ్య సీన్లు ఎలాగైతే కామెడీ టచ్‌తోతో మాసీగా ఉంటాయో.. ఇందులో రవితేజ-శ్రీలీల మధ్య సన్నివేశాలు అలాగే ఉంటాయని చెప్పి దర్శకుడు.. ఆలోచనకే పరిమితం అయ్యారు. రవితేజలో మాసీ కామెడీ టైమింగ్‌ని సరిగా ఎగ్జిక్యూట్ చేయలేదు. ప్రతినాయకుడు శివుడుగా నవీన్ చంద్ర విలనిజం పండించడం కోసం గట్టిగానే కష్టపడ్డారు. డిఫరెంట్ మేనరిజం ట్రై చేశారు. బట్ రొటీన్ విలన్ ఫార్మెట్ కావడంతో.. ఎంత కష్టపడ్డా ఆ పాత్ర అక్కడక్కడే తిరుగుతన్నట్టుగానే అనిపిస్తుంది. హీరో వెళ్లి విలన్‌కి వార్నింగ్ ఇవ్వడం.. విలన్ వచ్చి హీరోకి వార్నింగ్ ఇవ్వడం. ఓసారి అతను కొట్టడం. ఇంకోసారి ఇతను కొట్టడం. చివరికి హీరో చేతిలో చావడంతో శివుడు పాత్రని రొటీన్‌గానే ముగించారు. హైపర్ ఆది, మురళీశర్మ, నవ్యస్వామి, సముద్రఖని ఆయా పాత్రలకు న్యాయం చేశారు. నవ్వస్వామికి సింగిల్ డైలాగ్ లేకపోయినా.. హీరో పాత్రకి మంచి ఎలివేషన్స్ వచ్చే సీన్‌లో భాగం అయ్యింది. టెక్నికల్‌‌గా సినిమా చాలా గ్రాండ్‌గా అనిపిస్తుంది. నాగవంశీ ఖర్చుకి వెనకాడకుండా క్వాలిటీ సినిమా అందించే ప్రయత్నం చేశారు. ఆరున్నర కోట్లతో వేసిన స్టేషన్ సెట్.. అలాగే ‘మాస్ జాతర’లో జాతర ఎపిసోడ్ కోసం మరో భారీ సెటప్ హైలైట్‌గా నిలిచింది. ఓ కొత్త దర్శకుడికి ఎక్కడా రాజీపడకుండా గట్టిగానే ఖర్చు చేశారు.