భారత అత్యున్నత న్యాయస్థానం తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా న్యాయమూర్తి నియమితులైన సంగతి తెలిసిందే. ఆయన నవంబర్ 24వ తేదీన దేశ 53వ సీజేఐగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక హర్యానా రాష్ట్రం నుంచి సీజేఐ పదవిలోకి వచ్చిన మొట్టమొదటి వ్యక్తి జస్టిస్ సూర్యకాంత్ కావడం విశేషం. ఆయన త్వరలోనే సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా.. ఆయన ఆస్తుల గురించి దేశవ్యాప్తంగా మీడియా, సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో జస్టిస్ సూర్యకాంత్‌కు సంబంధించిన వివరాలు ఉండగా.. ఇప్పుడు అవి బయటికి వచ్చాయి.జస్టిస్ సూర్యకాంత్ నవంబర్ 24వ తేదీన సీజేఐగా బాధ్యతలు స్వీకరించి.. 2027 ఫిబ్రవరి 9వ తేదీ వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు. ఇక జస్టిస్ సూర్యకాంత్, ఆయన సతీమణి, ఇతర కుటుంబ సభ్యులపై భారీ మొత్తంలో ఆస్తులు ఉన్నట్లు వెల్లడైంది. జస్టిస్ సూర్యకాంత్, ఆయన భార్య, కుటుంబ సభ్యుల పేరు మీద మొత్తం రూ.8 కోట్లకు పైగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఇక ఒక్క జస్టిస్ సూర్యకాంత్ పేరు మీద 16 ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఇవన్నీ వడ్డీతో కలిపి సుమారు రూ.4.11 కోట్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఆయన భార్య పేరు మీద 6 ఎఫ్‌డీలు ఉండగా.. వాటి విలువ సుమారు రూ.1.97 కోట్లు అని వెల్లడించారు. ఇక జస్టిస్ సూర్యకాంత్‌కు దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరాస్తులు ఉన్నట్లు తేలింది. న్యూఢిల్లీలోని గ్రేటర్ కైలాష్-I.. చండీగఢ్ సెక్టార్ 10, సెక్టార్ 18C, గురుగ్రామ్ డీఎల్ఎఫ్-II, సుశాంత్ లోక్-1 ప్రాంతాల్లో ఇళ్లు, స్థలాలు ఉన్నాయి. హర్యానాలోని పంచకులలో 13.5 ఎకరాల వ్యవసాయ భూమి.. హిసార్‌లో 12 ఎకరాలు ఉన్నాయి. జస్టిస్ సూర్యకాంత్, ఆయన సతీమణి వద్ద మొత్తం 1.1 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఇక ఆయన భార్య వద్ద సుమారు 6 కిలోల వెండి సామాగ్రి ఉంది. ఇక జస్టిస్ సూర్యకాంత్‌కు ఇద్దరు కుమార్తెలు కాగా.. వారి పేరు మీద సుమారు రూ.59 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్లు.. 10 తులాల బంగారం ఉన్నాయి. అయితే జస్టిస్ సూర్యకాంత్ కుటుంబం ఎలాంటి అప్పులు ప్రకటించలేదు. జస్టిస్ సూర్యకాంత్ పేరు మీద సొంత వాహనం లేనప్పటికీ.. ఆయన భార్య పేరు మీద మారుతీ సుజుకీ వ్యాగనార్ కారు ఉంది.