ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్ విజేత ఎవరో తేలిపోయింది. శుక్రవారం ఢిల్లీ వేదికగా జరిగిన ఫైనల్‌లో పుణేరి పల్టాన్‌ను ఓడించిన దబాంగ్ ఢిల్లీ.. పీకేఎల్ 2025 విజేతగా నిలిచింది. మొత్తంగా రెండోసారి పీకేఎల్ టైటిల్ సాధించింది. చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో 31-28 తేడాతో పుణేరి పల్టాన్‌ను ఓడించింది. ప్రొ కబడ్డీ లీగ్ 12వ సీజన్ ఫైనల్‌ ఆద్యాంతం ఉత్కంఠ భరితంగా సాగింది. ఆధిపత్యం పదేపదే చేతులు మారిన ఈ మ్యాచ్.. అభిమానులకు అసలైన కబడ్డీ మజాను అందించింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఆధిపత్యం చెలాయించిన దబాంగ్ ఢిల్లీ సెకండాఫ్‌లో మాత్రం తడబడింది. అనవసర ట్యాకిల్స్‌తో పాటు పేలవ రైడ్స్‌తో పుణేరి పల్టాన్‌కు పాయింట్స్ సమర్పించుకుంది. దీంతో అనూహ్యంగా రేసులోకి వచ్చింది.మ్యాచ్ తొలి అర్ధభాగంలో దబాంగ్ ఢిల్లీ.. పుణేరి పల్టాన్‌ను ఓసారి ఆలౌట్ చేసి 20-14తో ఆధిక్యంలో నిలిచింది. కానీ ఆ తర్వాత తడబడింది. రైడర్స్ విఫలమవ్వడంతో ప్రత్యర్థి చేతిలో ఢిల్లీ ఒకసారి ఆలౌట్ అయ్యింది. దాంతో స్కోర్లు సమమై మ్యాచ్ ఉత్కంఠగా మారిపోయింది. కానీ మరో 40 సెకన్లలో మ్యాచ్ ముగుస్తుందనగా వెటరన్ డిఫెండర్ ఫజల్ అట్రాచలి చేసిన ట్యాకిల్ మ్యాచ్‌ గమనాన్నే మార్చింది. ఈ మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపకపోయిన అతడు.. సాధించిన తొలి పాయింట్‌తోనే మ్యాచ్‌ ఫలితాన్ని మార్చేశాడు. ఆ తర్వాత ఆధిక్యాన్ని కాపాడుకున్న దబాంగ్ ఢిల్లీ చిరస్మరణీయ విజయాన్నందుకుంది.దబాంగ్ ఢిల్లీ తరఫున నీరజ్ నర్వాల్(9), అజింక్యా పవార్(6) సత్తా చాటి విజయంలో కీలక పాత్ర పోషించారు. పుణేరి పల్టాన్ తరఫున ఆధిత్య షిండే(10), అభినేష్(4) రాణించినా టైటిల్ మాత్రం అందించలేకపోయారు. ఇక పీకేఎల్ 8వ సీజన్‌లో తొలిసారి దబాంగ్ ఢిల్లీ టైటిల్ సాధించింది. పుణేరి పల్టాన్ సైతం సీజన్ 10లో విజేతగా నిలిచింది. తాజా ఫలితంతో దబాంగ్ ఢిల్లీ ఖాతాలో రెండో టైటిల్ చేరింది.