దేశవ్యాప్తంగా కుక్కల బెడద తీవ్ర సమస్యగా మారింది. మాత్రమే కాకుండా.. పెంపుడు కుక్కలు కూడా ప్రజలపై దాడులకు తెగబడుతున్నాయి. ఈ వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. ఈ వీధి కుక్కల సమస్యపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు ఆయా రాష్ట్రాల అధికారులకు కఠిన ఆదేశాలే జారీ చేస్తోంది. ఈ క్రమంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని.. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్తగా ది మున్సిపల్ కార్పొరేషన్ చండీగఢ్ పెట్ అండ్ కమ్యూనిటీ డాగ్స్ బై లాస్ 2025ను నోటిఫై చేసింది. ఈ కొత్త నిబంధనలు పెంపుడు కుక్కల యజమానులతో పాటు.. బ్రీడర్‌లు, పెట్ షాపుల యజమానులు, కమ్యూనిటీ డాగ్ కేర్‌గివర్‌లు అందరికీ వర్తిస్తాయని తేల్చి చెప్పింది.6 ప్రమాదకర కుక్కల జాతులపై నిషేధంప్రమాదకరం అని పేర్కొంటూ 6 రకాల శునకాల జాతులపై చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ నిషేధం విధించింది. అమెరికన్ బుల్‌డాగ్, అమెరికన్ పిట్‌బుల్, బుల్ టెర్రియర్, కేన్ కోర్సో, డోగో అర్జెంటీనో, రోట్‌వీలర్ వంటి ఆరు ప్రమాదకరమైన జాతులను మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ఈ జాతుల కుక్కలను రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. అయితే ఇప్పటికే ఇలాంటి జాతుల కుక్కలు ఉన్న యజమానులకు మాత్రం ఈ నిషేధం వర్తించదని స్పష్టం చేసింది. కానీ.. 45 రోజుల్లోపు వారు తమ కుక్కలను తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.ఈ నిషేధిత జాతుల యజమానులు తమ కుక్కలను బయటకు తీసుకెళ్లేటప్పుడు అన్ని వేళలా ముక్కుతాడు, దాన్ని కంట్రోల్ చేయడానికి సరిపోయే బలమైన బెల్ట్‌ను ధరించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ కొత్త చట్టాలు నోటిఫై అయిన 45 రోజుల తర్వాత.. నిషేధిత కుక్కల జాతులను పెంచినా లేదా ఉంచినా జరిమానాతో పాటు కుక్కలను వెంటనే స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. మరోవైపు.. వీటితోపాటు అన్ని కుక్కలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. పెంపుడు కుక్కల మలవిసర్జనను వాటి యజమానులు తమ సొంత ప్రాంగణంలోనే చూసుకోవాలని పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశాల్లో కుక్కలు విసర్జించిన మలం తొలగించకపోతే భారీగా జరిమానాలు విధించనున్నారు. సుఖ్నా సరస్సు, రోజ్ గార్డెన్ వంటి పబ్లిక్ గార్డెన్‌లు, బహిరంగ ప్రదేశాల్లోకి కుక్కలను అనుమతించరు. బ్రీడర్‌లు, పెట్ షాపుల ఓనర్లు, ట్రైనర్‌లు తప్పనిసరిగా మున్సిపల్ కార్పొరేషన్‌లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.కుక్కల పెంపకానికి రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేసిన చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు.. నివాస గృహాల విస్తీర్ణాన్ని బట్టి ఎన్ని కుక్కలను పెంచుకోవచ్చో కూడా స్పష్టం చేసింది. 152 చదరపు గజాల లోపు ఉన్న ఇంట్లో ఒక కుక్కను పెంచుకునేందుకు అనుమతించారు. 366 గజాల కంటే తక్కువ విస్తీర్ణం ఉండే ఇంట్లో రెండు కుక్కలు.. 610 గజాలు ఉండే ఇంట్లో నాలుగు కుక్కల వరకు అనుమతిస్తారు. కమ్యూనిటీ కుక్కలకు ఆహారం అందించేవారు కూడా మున్సిపల్ కార్పొరేషన్ నిర్దేశించిన ప్రదేశంలోనే వాటికి ఆహారం అందించాలి. ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించే విధంగా లేదా మనుషులకు ప్రమాదం కలిగించే విధంగా బహిరంగ ప్రదేశాల్లో ఆహారం విసిరితే అది నేరంగా పరిగణించనున్నారు.