జూబ్లీహిల్స్ బైపోల్: 'విత్ మై ఓల్డ్ ఫ్రెండ్' అంటూ చంద్రబాబు ఇంట్రెస్టింగ్ ట్వీట్.. 'కారు' కోసమేనా..?

Wait 5 sec.

హైదరాబాద్ జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సహా.. మంత్రులు ప్రచారం చేస్తుండగా.. బీఆర్ఎస్ అభ్యర్థి సునీత గెలుపు కోసం.. కేటీఆర్, హరీష్, మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కష్టపడుతున్నారు. ఇక బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి విజయం కోసం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యులు కృషి చేస్తున్నారు. ఈ ఉప ఎన్నికను తీసుకోగా.. గెలుపు ఎవర్ని వరించనుందనేది ఆసక్తికరంగా మారింది. జూబ్లీహిల్స్‌లో మెజార్టీ సెటిలర్ల ఓట్లు ఉండటంతో టీడీపీ సైతం బరిలోకి దిగాలని భావించినా.. చివరి నిమిషంలో సైకిల్ పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకుంది. అయితే ఏపీలో బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీ తెలంగాణలో మాత్రం ఆ పార్టీకి మద్దతు ప్రకటించలేదు. ఇలాంటి తరుణంలో ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం ఓ ఆసక్తికర ట్వీట్ చేసారు. మూడు దశాబ్దాల క్రితం తాను ఉపయోగించిన అంబాసిడర్ కారును చూసి, పాత అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో.. 393 నంబర్ గల ఈ అంబాసిడర్ వాహనం ఆయన అధికారిక వాహన శ్రేణిలో ముఖ్యమైనది. ఆ రోజుల్లో రాష్ట్రమంతటా ఆయన ఈ కారులోనే విస్తృతంగా పర్యటించేవారు. గతంలో హైదరాబాద్‌లో ఉన్న ఈ అంబాసిడర్ కారును ఇటీవల మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. శుక్రవారం పార్టీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు.. ఆ కారును చూసి నిలబడి, గతాన్ని నెమరువేసుకున్నారు. ఆ కారుతో దిగిన ఫోటోలను 'ఎక్స్' వేదికగా అభిమానులతో పంచుకున్నారు. 'విత్ మై ఓల్డ్ ఫ్రెండ్' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ ఈ ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ పార్టీ గుర్తు కారు.. దీంతో చంద్రబాబు కారుకు సపోర్ట్ చేస్తున్నారంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఓల్డ్ ఫ్రెండ్ అంటే కేసీఆరేనని.. గతంలో చంద్రబాబు మంత్రివర్గంలో కేసీఆర్ మంత్రిగా పని చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఎన్నికల వేళ కారుకు ప్రచారం చేస్తున్నారని.. బీజేపీని ఇబ్బంది పెట్టకుండా ఆంధ్ర ఆడబిడ్డ సునీతను గెలిపించాలంటే ఇదే మార్గమని చంద్రబాబు ఇలా ట్వీట్ చేశారని నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మాగంటి గతంలో టీడీపీలో పని చేశారని.. ఆ ఫ్యామిలీ మీద చంద్రబాబుకు సాఫ్ట్ కార్నర్ కూడా కావొచ్చునని.. ఏది ఏమైనా బాబుగారి స్ట్రాటజీ ఊహకందనిదిగా ఉంటుందని కామెంట్లు పెడుతున్నారు. అయితే నిజంగానే కేసీఆర్ పార్టీకి, మాగంటి కుటుంబానికి సపోర్ట్ చేస్తున్నారా..? లేక తన పాత కారు కోసమే అలా ట్వీట్ చేశారా? అనేది చంద్రబాబుకే తెలియాలి.