భారత రైల్వేలో కొత్త శకం.. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ప్యాసింజర్ రైళ్లు

Wait 5 sec.

భారతీయ రైల్వే రంగంలో మరో కొత్త శకం ప్రారంభం కానుంది. గత కొన్నేళ్లలో భారతీయ రైల్వేలు విప్లవాత్మక మార్పులను చూస్తున్నాయి. రాబోయే 5 ఏళ్లలో గంటకు 280 కిలోమీటర్ల వేగానికి అనుగుణంగా కవచ్ 5.0 టెక్నాలజీని అభివృద్ధి చేయనున్నట్లు రైల్వే మంత్రి బుధవారం ప్రకటించారు. ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ రైల్వే పరికరాల ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో మాట్లాడిన అశ్వినీ వైష్ణవ్.. వరల్డ్ క్లాస్ ప్రమాణాలను చేరుకునే లక్ష్యంతో భారత్ తన రైల్వే వ్యవస్థను పూర్తిగా పునఃరూపకల్పన చేస్తోందని తెలిపారు.ప్రస్తుతం దేశంలో నడుస్తున్న రైళ్లకు మరింత మెరుగైన తరం రైళ్లను అభివృద్ధి చేయడంపై భారత్ దృష్టి సారించిందని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఇందులో భాగంగానే వందే భారత్ 4.0.. అమృత్ భారత్ 4.0లో భాగంగా నెక్స్ట్ జనరేషన్ హై స్పీడ్ రైళ్లను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తోందని వివరించారు. విదేశాలకు ఎగుమతి చేసే లక్ష్యంతో అక్కడి మార్కెట్‌ను ఆకర్షించేలా ఈ కొత్త రైళ్ల నిర్మాణం ఉంటుందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం భారత్.. వందే భారత్ 3.0 వెర్షన్‌ను నడుపుతోందని.. ఇది వందే భారత్ 2.0 వెర్షన్ కంటే మెరుగ్గా ఉందని వెల్లడించారు. అయితే ఇప్పుడు తాము వందే భారత్ సర్వీసులను పూర్తిగా రీడిజైన్ చేసి.. ప్రపంచంలోని అత్యుత్తమ రైళ్లతో పోటీపడే కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేయనున్నట్లు వివరించారు.భవిష్యత్ అవసరాల కోసం కొత్త రైలు కారిడార్లను అభివృద్ధి చేయడం, ప్రస్తుతం ఉన్న ట్రాక్‌ల సామర్థ్యాన్ని పెంచడంపై భారతీయ రైల్వే దృష్టి పెట్టిందని అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు. ఇక ప్రస్తుతం డెవలప్ చేయనున్న కొత్త స్పెషల్ ప్యాసింజర్ కారిడార్లలో చాలా వరకు గంటకు 350 కిలోమీటర్ల డిజైన్ వేగాన్ని.. గంటకు 320 కిలోమీటర్ల ఆపరేటింగ్ వేగాన్ని కలిగి ఉంటాయని వివరించారు. ఈ హై స్పీడ్ కారిడార్ల కోసం.. రైల్వే భద్రతా వ్యవస్థ అయిన కవచ్ తర్వాతి వెర్షన్ అయిన కవచ్ 5.0 ను రాబోయే 5 ఏళ్లలో గంటకు 280 కిలోమీటర్ల వేగానికి అనుగుణంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఈ భవిష్యత్ చర్యలన్నీ భారతీయ రైల్వేను మరింత ఆధునికీకరించి.. ప్రపంచంలోనే అత్యుత్తమ రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటిగా మార్చేందుకు ఉపయోగపడతాయని రైల్వే శాఖ మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.