Diwali Bonanza: దీపావళి సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు అదిరే శుభవార్త. దీపావళిని పురస్కరించుకుని పలు ప్రభుత్వ విభాగాలు ఇప్పటికే తమ ఉద్యోగులకు ఉత్పత్తి ఆధారిత బోనస్ ప్రకటిస్తున్నాయి. తాజాగా సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పోస్టల్ విభాగం తమ ఉద్యోగులకు ప్రొడక్టివ్ లింక్డ్ బోనస్ (PLB) ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం 2024- 25కి సంబంధించి 60 రోజుల జీతాన్ని బోనస్‌గా చెల్లిస్తామని తెలిపింది. ఈ బోనస్ ద్వారా గ్రూప్- సీ, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, నాన్ గెజిటెడ్ గ్రూప్ బీ ఉద్యోగులు, గ్రామీణ్ డాక్ సేవక్ సహా ఫుల్ టైం క్యాజువల్ కార్మికులు లబ్ధిపొందనున్నారు. వీరికి సైతం బోనస్మార్చి 31, 2025 తర్వాత ఎవరైతే ఉద్యోగ విరమణ చేసిన వారు, రాజీనామా చేసిన వారు, విధుల నుంచి వెళ్లినవారు, పోస్టల్ విభాగంలోనే డిప్యూటేషన్ ద్వారా వెళ్లిన వారితో పాటు పోస్టల్ విభాగం వెలుపల డిప్యూటేషన్ ద్వారా వెళ్లిన వారికి సైతం ఈ బోనస్ పొందే అర్హత ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. నిబంధనల ప్రకారం అర్హులైన ఉద్యోగులందరికీ ఉత్పత్తి ఆధారిత బోనస్ అందిస్తామని స్పష్టం చేసింది. లబ్ధి పొందే ఉద్యోగులు వీరే.. గ్రామీణ డాక్ సేవక్‌ లోని రెగ్యులర్ ఉద్యోగులతో పాటు రెగ్యులర్, టెంపరరీ ఫుల్ టైమ్ వర్కర్లు అర్హులు. ఉద్యోగుల సగటు జీతం ఆధారంగా ఈ బోనస్ లెక్కిస్తారు. రెగ్యులర్ ఉద్యోగులకు ఫార్ములా: యావరేజ్ శాలరీ x 60 రోజులు/ 30.4 తో లెక్కగడతారు. అయితే, బోనస్ లెక్కించేందుకు శాలరీ లిమిట్ రూ. 7000 గా నిర్ణయించారు. ఇక గ్రామీణ డాక్ సేవక్స్ విభాగంలో బోనస్ అనేది టైమ్ రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్ ఆధారంగా నిర్ణయిస్తారు. 60 రోజుల జీతం బోనస్ అనేది పోస్టల్ విభాగంలోని ఉద్యోగులకు దీపావళికి ముందే పండగ తీసుకొస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఈసారి గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తోన్న గ్రామీణ డాక్ సేవకులను, తాత్కాలిక ఉద్యోగులను బోనస్ పరిధిలోకి తీసుకోవడం అనేది డిపార్ట్‌మెంటులో పండగ వాతావరణాన్ని తీసుకొస్తుందని పేర్కొంది. ఈ బోనస్ అనేది ఉద్యోగుల కష్టాన్ని గుర్తించడమే కాదని, ఈ పండగ సమయంలో ఆర్థికంగా ఉపశమనం కల్పిస్తుందని, సంతోషంగా పండగ జరుపుకొనేందుకు అవకాశం కల్పిస్తుందని వెల్లడించింది.