ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేసినప్పటి నుంచి.. బస్సుల్లో జరుగుతున్న ఘటనలతో ప్రయాణికులతోపాటు ఆర్టీసీ సిబ్బంది కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు. కొందరు మహిళలు సీట్ల కోసం, మరికొందరు బస్సు ఎక్కడ పడితే అక్కడే ఆపాలంటూ రకరకాల డిమాండ్లు తెస్తుండటంతో డ్రైవర్, కండక్టర్లకు కొత్త తిప్పలు వచ్చి పడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఎన్టీఆర్‌ జిల్లాలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎక్కిన ఓ మహిళ.. వీరంగం సృష్టించింది. డ్రైవర్, కండక్టర్లపై విరుచుకుపడింది. అడ్డుకునేందుకు యత్నించిన ఆ బస్సులోని ప్రయాణికులపైనా మండిపడింది. దీంతో చేసేదేమీ లేక ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి.. పోలీసులకు అప్పగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జగ్గయ్యపేట డిపోకు చెందిన ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు.. విజయవాడ నుంచి పెనుగంచిప్రోలు వెళ్తోంది. ఈ క్రమంలోనే బస్సు ఎక్కిన పరిటాల గ్రామానికి చెందిన ఓ మహిళ.. ఫుట్‌పాత్‌పై నిలబడింది. అయితే అది గమనించిన ఆ బస్సు డ్రైవర్.. ఆమెను మెట్ల మీది నుంచి పైకి రావాలని.. ఫుట్‌పాత్ ప్రయాణం ప్రమాదమని హెచ్చరించారు. అయినప్పటికీ ఆమె వినలేదు. దీంతో గట్టిగా చెప్పడంతో ఆమె డ్రైవర్, కండక్టర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే వారి మధ్య చిన్నగా మొదలైన గొడవ.. తీవ్ర స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే ఆ మహిళ బెదిరింపులకు దిగింది. తన ఫొటో తీసుకుని.. ఆ ఫొటోను విజయవాడ సిటీ, చిల్లకల్లు, కంచికచర్ల పోలీస్ స్టేషన్‌లకు తీసుకెళ్లి చూపించండంటూ వారికి సూచించింది. ఆ ఫోటో చూడగానే పోలీసులకే దడ పుడుతుందంటూ డ్రైవర్, కండక్టర్‌తో తీవ్ర దురుసుగా ప్రవర్తించింది. అయితే ఆ మహిళ తీరుతో తీవ్రంగా విసిగిపోయిన తోటి ప్రయాణికులు.. ఆమెకు సర్దిచెప్పి.. ఆ గొడవను ముగించేందుకు ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ వారు చెప్పింది వినకుండా.. ప్రయాణికులపైనా ఎదురుదాడికి దిగింది. ఇక ఆ మహిళ పరిటాల గ్రామంలో దిగాల్సి ఉండగా.. ఆ బస్సు డ్రైవర్ మాత్రం అక్కడ ఆపలేదు. నేరుగా ఆ బస్సును తీసుకెళ్లి కంచికచర్ల పోలీస్ స్టేషన్‌ వద్ద ఆపారు. ఆ మహిళ ప్రవర్తించిన తీరుపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆ మహిళను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.