పండగ వేళ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. రైళ్లలో అవి తీసుకెళ్తే 3 నెలల జైలు శిక్ష

Wait 5 sec.

పండగ సందర్భంగా.. రైళ్లలో ప్రయాణాలు చేసే వారికి తాజాగా కీలక సూచనలు జారీ చేసింది. రైళ్లలో ప్రయాణించే సమయంలో ప్రయాణికుల భద్రతకు, రైల్వే ఆస్తులకు నష్టం కలిగించే పనులు చేయకూడదని హితవు పలికింది. అదే సమయంలో ప్రయాణికులు తమ వెంట పేలుడు, మండే స్వభావం ఉన్న వస్తువులను తీసుకెళ్లొద్దని తీవ్ర హెచ్చరికలు చేసింది. రైళ్లలో లేదా రైల్వే స్టేషన్లలో ఇలాంటి పేలుడు పదార్థాలు, మండే స్వభావం ఉండే వస్తువులను తీసుకెళ్లడం వలన ప్రయాణికుల భద్రతకు తీవ్ర ముప్పు కలుగుతుందని.. ఇది చుట్టుపక్కల ఉన్న ప్రయాణికులందరికీ అత్యంత ప్రమాదకరమని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ఇన్ని చెప్పినప్పటికీ ఎవరైనా అలాంటి వస్తువులను తీసుకెళ్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. రైళ్లలో మండే స్వభావం గల వస్తువులు, పేలుడు పదార్థాలను తీసుకెళ్లడం రైల్వే చట్టం 1989లోని సెక్షన్‌ 164, సెక్షన్‌ 165 ప్రకారం నేరమని దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. ఇందుకు గానీ సదరు ప్రయాణికులకు రూ.1000 వరకు జరిమానా లేదా 3 సంవత్సరాల జైలు శిక్ష లేదా రెండూ విధించే అవకాశాలు ఉంటాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. అందుకే రైల్వే శాఖ ఇచ్చిన సూచనలు పాటిస్తూ.. రైళ్లలో ప్రయాణించాలని పేర్కొన్నారు. రైళ్లలో లేదా రైల్వే పరిసరల ప్రాంతాల్లో బాణసంచా లేదా ఇతర పేలుడు, మండే స్వభావం గల వస్తువులను తమ లగేజీలు, పార్శిల్‌గా తీసుకెళ్లవద్దని ప్రయాణికులకు రైల్వే శాఖ స్పష్టం చేసింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా, రైళ్లలో లేదా రైల్వే స్టేషన్లలో బాణసంచా లేదా ఇతర ఏదైనా అనుమానాస్పద, ప్రమాదకరమైన పేలుడు స్వభావం ఉన్న వస్తువులను తోటి ప్రయాణికులు గమనించినట్లయితే.. సమాచారం అందించాలని రైల్వే అధికారులు సూచించారు. వెంటనే అక్కడే ఉన్న రైల్వే సిబ్బందికి ఫిర్యాదు చేయవచ్చని.. అది వీలు కాని పక్షంలో సెక్యూరిటీ హెల్ప్‌లైన్ 139 నంబర్‌కు కాల్‌ చేయాలరని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేస్తోంది. రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు.. మనతో పాటు మన చుట్టూ ఉండే ఇతర ప్రయాణికులకు కూడా ఎలాంటి నష్టం కలిగించకుండా ప్రయాణాలు చేయాలని అధికారులు తేల్చి చెప్పారు.