శ్రీకాళహస్తీశ్వరాలయంలో దర్శన వేళల్లో మార్పులు చేశారు. కార్తీకమాసం సందర్భంగా ఈ నెల 22 నుంచి వచ్చే నెల 20 వరకు ఆలయంలో దర్శన వేళల్లో మార్పులు అమల్లో ఉంటాయని ఆలయ ఈవో బాపిరెడ్డి తెలిపారు. ఈ మార్పుల వల్ల భక్తులు ఆలయానికి సంబంధించిన వివిధ సేవలను నిర్దేశిత సమయాల్లో దర్శించుకోవచ్చు. ఉదయం 4.15 గంటలకు గోమాత పూజ, తిరుమంజనం ఉంటాయి. ఆ తర్వాత 4.30 గంటలకు సుప్రభాతసేవ మొదలవుతుంది. 5 గంటలకు సర్వదర్శనం, ప్రథమకాల అభిషేకం ప్రారంభమవుతాయి. ఉదయం 6 గంటలకు రెండోకాల అభిషేకం, 10 గంటలకు మూడోకాల అభిషేకం జరుగుతాయి. సాయంత్రం 3.30 గంటలకు ప్రదోష కాలంలో మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తారు. రాత్రి 9 గంటలకు ఏకాంతసేవతో రోజు ముగుస్తుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి తమకు సహకరించాలని ఆలయ అధికారులు సూచిస్తున్నారు.శ్రీకాళహస్తిలో నేటి పూజల వివరాలు ఇలా ఉన్నాయి.. ఉదయం 5.30: సుప్రభాత సేవ, 5.45: గోమాత పూజ, 6.30: ప్రథమ కాలాభిషేకం, 7.30: ద్వితీయ కాలాభిషేకం, 11.00: నిత్యోత్సవం, చండీ, రుద్రహోమాలు..11.30: నిత్య కల్యాణం, సాయంత్రం 4.00: ప్రదోషకాలాభిషేకం, రాత్రి 7.00: నీరాజనమంత్రపుష్పం, 9.00: ఏకాంతసేవ సర్వదర్శనం: ఉదయం 6-రాత్రి: 9 గంటలు రాహు, కేతు పూజలు: ఉ. 6 నుంచి సా.5 గంటల వరకు నిర్వహిస్తారు. అభిషేకాలు: శ్రీమృత్యుంజయశివలింగానికి (సోమవారం), కాలభైరవునికి (మంగళవారం), శ్రీమేధా దక్షిణామూర్తికి (గురువారం), శనిభగవానునికి (శనివారం), సూర్యనారాయణమూర్తికి (ఆదివారం). శుక్రవారం: మనోన్మణికి ఊంజల్‌సేవ.. త్రయోదశినాడు ప్రదోషమూర్తులకు విశేష అభిషేకాలు, పున్నమికి ఊంజల్‌సేవ, అమావాస్యకు ఉత్సవమూర్తుల ఊరేగింపు నిర్వహిస్తారు. తిరుమలలో పెద్దశేష వాహనంఇదిలా ఉంటే.. తిరుమలలో అక్టోబర్ 25వ తేదీన‌ నాగుల చవితి ప‌ర్వదినం సందర్భంగా పెద్దశేష వాహనంపై రాత్రి 7 నుండి 9 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు ఉభ‌య‌ దేవేరుల‌తో క‌లిసి దర్శనమివ్వనున్నారు. సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా స్వామివారికి విశేష సేవలందించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి సహస్రనామాలతో శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం అంటూ నిత్య పూజలు అందుకుంటున్నారు. అటు రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీ వైకుంఠంలోని నిత్యసూరులలో ఆద్యుడు. ఈ విధంగా స్వామివారు, దాసభక్తికి మారురూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన శ్రీ ఆదిశేషుడిపై ఉభయదేవేరులతో కూడి తిరువీధులలో విహరిస్తూ భక్తులకు అభయమివ్వడమే కాకుండా శరణాగతి ప్రపత్తిని కూడా సాక్షాత్కరింపచేస్తాడు. అందుకే బ్రహ్మోత్సవ వాహన సేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునికే ఆ భగవంతుడు ప్రసాదించాడు.