బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది దక్షిణ తమిళనాడు తీరం మీదుగా కూడా వ్యాపించి ఉంది. మరో ఉపరితల ఆవర్తనం ఉత్తర తమిళనాడు తీరం, నైరుతి బంగాళాఖాతంలో 3.1 కి.మీ ఎత్తులో ఉంది. ఈ రెండు ఆవర్తనాలు కలిసిపోయాయి. ఈ వాతావరణ మార్పుల వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలతో పాటు యానాం ప్రాంతాల్లో రాబోయే మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటున్నారు. అలాగే కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కూడా పడతాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.'ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ అల్లూరి సీతారామరాజు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, కడప, అన్నమయ్య, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు,మెరుపులతో వర్షాలు పడేప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి' అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆదివారం రాత్రి శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు. చెట్ల క్రింద ఉండకండి. అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే సురక్షితంగా ఉండండి' అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.దేశంలోని పలు రాష్ట్రాల నుంచి నైరుతి రుతుపవనాలు వేగంగా వెనక్కి వెళ్తున్నాయి. తెలంగాణ, ఒడిశా, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాల నుంచి సోమ, మంగళవారాల్లో నైరుతి నిష్క్రమించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారాయని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. రాబోయే రెండు రోజుల్లో మన రాష్ట్రం నుంచి కూడా నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో మూడు, నాలుగు రోజుల్లో రాష్ట్రంలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది. ఈలోగా, సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వెల్లడించింది.