ఆర్సీబీ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. ఐపీఎల్‌కు విరాట్ కోహ్లీ గుడ్‌బై! కాంట్రాక్ట్ రెనివల్‌కు నో చెప్పాడా?

Wait 5 sec.

: విరాట్ కోహ్లీ.. ఈ దిగ్గజ ఆటగాడు ఇండియా తరఫున ఆడినప్పుడు ఎంత క్రేజ్ ఉంటుందో.. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున ఆడినప్పుడు కూడా అంతే ఆదరణ ఉంటుందని చెప్పొచ్చు. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి.. ఒకే ఫ్రాంఛైజీ తరఫున ఆడుతున్న ఆటగాడు విరాట్ కోహ్లీ మాత్రమే. 17 ఏళ్లు టైటిల్ కోసం ఎంతో శ్రమించగా.. ఈ ఏడాది (2025) 18వ సీజన్‌లో ఎట్టకేలకు ఆర్సీబీ టైటిల్ కూడా గెలిచింది. ఇలా 18 ఏళ్లుగా ఆర్సీబీ అంటే కోహ్లీ.. కోహ్లీ అంటే ఆర్సీబీ అన్నట్లుగా తయారైందంటేనే.. ఆ జట్టుకు కోహ్లీ చేసిన కృషి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇన్నాళ్లకు ఈ అరుదైన అనుబంధానికి తెరపడనుందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కోహ్లీ.. ఇప్పుడు ఐపీఎల్ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.కాంట్రాక్ట్ రెనివల్‌‌కు విరాట్ నో?17 ఏళ్లుగా ఐపీఎల్‌లో వరుస పరాభవాలతో ఎన్నో అవమానాల్ని దాటుకొని.. 18వ సీజన్ విజేతగా నిలిచింది ఆర్సీబీ. దీంతో కోహ్లీ కల కూడా నెరవేరింది. ఈ విజయం తర్వాత కోహ్లీ మనసు మారిందనే చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే 2026 ఐపీఎల్ సీజన్ కోసం కోహ్లీ.. తన కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించేందుకు ఇష్టపడట్లేదట. ఇన్నాళ్లకు ఐపీఎల్ టైటిల్ గెలవడంతో .. ఐపీఎల్‌కు ఇదే ఘనమైన వీడ్కోలు ఇచ్చినట్లు అవుతుందని కోహ్లీ బలంగా నమ్ముతున్నట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. 'ఐపీఎల్‌కు ఆడినన్ని రోజులు ఆర్సీబీకే ఆడతాను' అని కోహ్లీ గతంలో ఎన్నో సార్లు చెప్పాడు. అందుకే.. కాంట్రాక్ట్ రెనివల్‌కు నో చెప్పాడంటే.. ఐపీఎల్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు.ప్రపంచంలోనే అత్యంత ఫిట్‌గా ఉండే అతి కొద్ది మంది క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ముందువరుసలో ఉంటాడు. గాయం కారణంగా, ఫిట్‌నెస్ లేమితో ఆటకు దూరమైన సందర్భాలు వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. అలాంటి కోహ్లీ.. గతేడాది టీమిండియా టీ-20 వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత.. కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇటీవల తనకెంతో ఇష్టమైన టెస్ట్ క్రికెట్ నుంచి కూడా తప్పుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో 10 వేల పరుగులకు చేరువలో ఉన్న సమయంలో.. ఫిట్‌గా ఉన్నప్పటికీ.. తప్పుకోవడంతో సగటు క్రికెట్ అభిమాని షాక్ అయ్యాడని చెప్పొచ్చు. 'అద్దంలో చూసుకున్నప్పుడు జుట్టు తెల్లబడటంతో .. తప్పుకోవాల్సిన సమయం వచ్చింది.' అంటూ కోహ్లీ టెస్టులకు గుడ్‌బై చెప్పడం అభిమానుల్ని ఆశ్చర్యపరిచింది. వ్యక్తిగత జీవితానికే ప్రాధాన్యం..కొన్నాళ్లుగా విరాట్ కోహ్లీ.. తన వ్యక్తిగత జీవితానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నాడని చెప్పొచ్చు. ఇప్పటికే లండన్‌లో స్థిరపడిపోయినట్లు వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. బీసీసీఐలో జరుగుతున్న రాజకీయాలతో విసిగిపోయిన కోహ్లీ.. త్వరలోనే వన్డే క్రికెట్‌ నుంచి కూడా తప్పుకోవాలని యోచిస్తున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు.. ఐపీఎల్ టైటిల్ గెలిచాక విజయోత్సవ ర్యాలీలో తొక్కిసలాట కారణంగా 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోవడం.. కోహ్లీని తీవ్ర మనస్థాపానికి గురిచేసిందని.. అందుకే అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు త్వరగా వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.