శ్రీలంక ప్రజలకు, ఏపీలోని ఆ వర్గానికి అంత దగ్గర సంబంధమా.. భాష మారినా, రక్తం మారలేదా? అంతర్జాతీయ అధ్యయనంలో ఆసక్తికర అంశాలు..

Wait 5 sec.

మనిషి పుట్టుక.. అదో మహాద్భుతం.. జీవ పరిణామ క్రమంలో కోతి నుంచి మనిషి రూపాంతరం చెందాడని శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ శాస్త్రాలకు అందని, సైన్సుకు దొరకని ఓ శక్తి మనిషిని నడిపిస్తోందని నమ్మేవారెందరో.. ఆ శక్తే మనిషిని రాతి యుగం నుంచి అనాగరికం వైపు.. అటు నుంచి నాగరికం వైపు అడుగులు వేసేలా చేసిందనేది వారి ప్రబల నమ్మకం. ఇక్కడ నమ్మకాల సంగతి పక్కన పెడితే ప్రకృతి అందమైన సృష్టే మానవుడు. మానవ పరిణామ క్రమంలో.. నదీతీరం వెంట ప్రయాణాలు, స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడం.. సంతానం పెంచుకోవడం, జాతుల మధ్య సంఘర్షణ.. ఇలా అస్థిత్వం కోసం నేటి వరకూ మనిషి పోరాడుతూనే ఉన్నాడు. అయితే ఈ జీవ పరిణామ క్రమాన్ని కనుగొనేందుకు, దాని వెనుక ఉన్న రహస్యాలను అన్వేషించేందుకు శాస్త్రవేత్తలు అధ్యయనాలు సాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఓ అధ్యయనంలో ఆశ్చర్యకరమైన విషయం వెలుగుచూసింది.*మనకు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు.. శ్రీలంక ప్రజలకు జన్యుపరంగా సామీప్యతలు ఉన్నాయనే సంగతి ఓ అధ్యయనంలో వెల్లడైంది. అమెరికా, శ్రీలంక, భారతదేశానికి చెందిన కొంతమంది పరిశోధకుల అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. శ్రీలంకలోని మెజారిటీ ప్రజలైన సింహళీయులు, ఆదివాసీల జన్యువులను పూర్తిస్థాయిలో విశ్లేషించిన అనంతరం (జీనోమ్ సీక్వెన్సింగ్) ఈ విషయాన్ని వారు కనుగొన్నారు. శ్రీలంకలోని సింహళీయులు, ఆదివాసీలు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని సామాజికవర్గాలతో జన్యుపరంగా సామీప్యతను కలిగి ఉన్నారని గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోని మాల, మాదిగ, కాపు, యాదవ వర్గాలతో శ్రీలంక సింహళీయులు, ఆదివాసీలు జన్యుపరంగా దగ్గరి సంబంధం కలిగి ఉన్నారని ఈ అధ్యయనంలో తేలింది.* మరోవైపు ఇప్పటి వరకూ సింహళీయుల మూలాలు ఉత్తర భారతంలో ఉన్నాయని ఇన్ని రోజులు చరిత్ర కారులు భావిస్తూ వచ్చారు. ఎందుకంటే సింహళీయులు మాట్లాడే సింహళ భాష ఉత్తర భారతదేశ ప్రజలు మాట్లాడే ఇండో యూరోపియన్ కుటుంబం భాషలకు (ఇంగ్లీష్, హిందీ, ఫ్రెంచ్, రష్యన్ వంటివి) దగ్గర ఉండటంతో అలా అనుకుంటూ వచ్చారు. అలాగే దక్షిణ భారతదేశంలోని ప్రజలు మాట్లాడే భాషలు ద్రవిడ కుటుంబానికి చెందినవి కావటంతో ఇన్నిరోజులు అలా భావిస్తూ వచ్చారు. అయితే సింహళీయుల మూలాలు ఉత్తర భారతదేశం కంటే, దక్షిణ భారతదేశం అందులోనూ ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని సామాజిక వర్గాలతో అత్యంత దగ్గరగా ఉన్నాయని ఈ పరిశోధనలో తేలింది. ఈ అధ్యయనం 'కరెంట్ బయాలజీ' అనే జర్నల్‌లో ప్రచురించారు.*జన్యు విశ్లేషణ ప్రకారం, సింహళీయులు, ఆదివాసీలు దక్షిణ భారతదేశంలోని, అందులోనూ మరీ ముఖ్యంగా ఏపీకి చెందిన మాల, మాదిగ, కాపు, యాదవ వర్గాలతో బలమైన జన్యు సారూప్యతను కలిగి ఉన్నాయని.. అలాగే నేటి ఉత్తర భారత ప్రజలతో సింహళీయులకు బలమైన జన్యు సంబంధాలు లేవని అధ్యయనంలో తేలటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇందులోనూ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌‌లోని మాల వర్గానికి.. శ్రీలంకలోని ఆదివాసీలు, సింహళీయులు, తమిళులు ఒకే విధమైన జన్యు సంబంధం కలిగి ఉన్నట్లు ఈ అధ్యయనం తేల్చింది. దీంతో సింహళీయులు, ఆదివాసీలు, శ్రీలంక తమిళుల పూర్వీకులకు మాల వర్గానికి దగ్గరి సంబంధాలు ఉండొచ్చనే చర్చ నడుస్తోంది. అలాగే వేల సంవత్సరాల క్రితం, దక్షిణ భారతదేశం నుంచి శ్రీలంకకు వలస వచ్చిన ప్రజలే.. శ్రీలంక జనాభాకు బలమైన జన్యు ఆధారాన్ని ఇచ్చారని పరిశోధకులు భావిస్తున్నారు. అలాగే సింహళీయులు.. ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన ఇండో - యూరోపియన్ భాషను స్వీకరించినప్పటికీ.. జన్యుసంబంధాలు మాత్రం దక్షిణ భారత ప్రజలవేనని తెలుస్తోంది. ఒక రకంగా భాష మారినా.. రక్తం మారలేదని అధ్యయనం చెప్తోంది.