పెళ్లయి ఏళ్లు గడిచినా పిల్లలు పుట్టలేదా..? ఆ దంపతులకు ఇదొక వరం.. రూపాయి ఖర్చు లేకుండా..

Wait 5 sec.

తెలంగాణ రాష్ట్రంలో సంతాన సమస్యలతో బాధపడుతున్న దంపతులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. లక్షల రూపాయలు వెచ్చించి ప్రైవేటు ఐవీఎఫ్ కేంద్రాలకు వెళ్లలేని పేద, మధ్యతరగతి కుటుంబాల కోసం జిల్లా కేంద్రాల్లోని ఆస్పత్రులలో సంతాన సాఫల్య కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగానే వరంగల్‌లోని చందా కాంతయ్య మెమోరియల్ (సీకేఎం) ఆస్పత్రిలో ఏర్పాటైన ఐవీఎఫ్ కేంద్రం పేదలకు ఉచితంగా సేవలు అందిస్తూ ఆశాదీపంగా మారింది. ప్రైవేటు కేంద్రాలలో దంపతుల దోపిడీ.. నేటి జీవనశైలి , ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాల వల్ల చాలా మందిలో ఫర్టిలిటీ సమస్యలు పెరుగుతున్నాయి. దీనిని అదునుగా చేసుకుని ప్రైవేటు ఐవీఎఫ్ కేంద్రాలు పెరుగుతున్నాయి. వరంగల్ నగరంలో గతంలో ఒకటి, రెండు మాత్రమే ఉన్న ఐవీఎఫ్ కేంద్రాలు ఇప్పుడు పన్నెండుకు పైగా పెరిగాయి. సంతానం కోసం ఆరాటపడే దంపతుల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని... ఈ ప్రైవేటు క్లినిక్‌లు రూ.2 లక్షల నుండి రూ.5 లక్షల వరకు భారీ ప్యాకేజీలు మాట్లాడుకుని ధనార్జనకు పాల్పడుతున్నాయి. హైదరాబాద్‌లో వెలుగు చూసిన 'సృష్టి' ఫర్టిలిటీ సెంటర్ వ్యవహారాలు వంటివి ప్రైవేటు కేంద్రాల నాణ్యత, నిజాయితీపై సందేహాలు రేకెత్తిస్తున్నాయి. లక్షలు ఖర్చు పెట్టినా సంతానం కలగకపోతే.. వైద్యుల సూచనలు సరిగా పాటించకపోవడం వల్లే ఫలితం రాలేదని సాకులు చెబుతూ తప్పుకుంటున్నారు. ఈ పరిస్థితి పేద, మధ్యతరగతి వర్గాలకు తీవ్ర ఇబ్బందులు సృష్టిస్తోంది. సంతానం కోసం రూపాయలు వెచ్చించలేని కుటుంబాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా చికిత్స అందించేందుకు చర్యలు చేపట్టింది. ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఐవీఎఫ్ క్లినిక్‌లను ఏర్పాటు చేసింది. వరంగల్ సీకేఎం ఆస్పత్రిలో సంతాన సాఫల్య చికిత్స కేంద్రాన్ని ఈ ఏడాది మార్చి 15న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. 2017లో ఎంజీఎంలో ఈ కేంద్రం ఏర్పాటుకు ప్రయత్నించినా, స్థానిక నాయకుల నిర్లక్ష్యం కారణంగా అది కార్యరూపం దాల్చలేదు. ఈ కేంద్రంలో ఫర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, ఎంబ్రియోలజిస్ట్, ఆండ్రాలజిస్ట్, అనస్థీషియాలజిస్ట్ వంటి సిబ్బందిని నియమించి ఉన్నత స్థాయి సేవలను అందిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా బాధితులు ఇక్కడికి వస్తున్నారు. సీకేఎం ఐవీఎఫ్ సేవలు ప్రారంభించినప్పటి నుంచి దంపతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వైద్యులు ముందుగా కౌన్సిలింగ్ ఇచ్చి.. అనంతరం ట్రీట్‌మెంట్ అందిస్తూ... ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేయడం వలన సత్ఫలితాలు వస్తున్నాయి. మార్చి నెలలో 29 మంది చికిత్స కోసం రాగా.. ఏప్రిల్‌లో 117, మేలో 118, జూన్‌లో 106, జులైలో 108 మంది వచ్చారు. పండుగల కారణంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కొంత రష్ తగ్గినా.. ప్రతి నెల సగటున వంద మంది వరకు సేవలు వినియోగించుకుంటున్నారు. సక్సెస్ రేటు కూడా ఎక్కువగానే ఉండటం ఈ కేంద్రంపై నమ్మకాన్ని పెంచుతోంది. అయితే.. ప్రస్తుతం ఒక్క డాక్టర్ మాత్రమే అందుబాటులో ఉండటం వలన బాధితులు కొంత ఇబ్బందులు పడుతున్నారు. చికిత్స కోసం వస్తున్న దంపతులు మరింత మంది సిబ్బందిని నియమించి.. తగిన వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వ ఐవీఎఫ్ కేంద్రాలు పేదలకు ఆసరాగా నిలుస్తున్నందున.. వాటిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.