తెలంగాణలో ప్రధానంగా అడవులు, ఏజెన్సీ ప్రాంతాల జిల్లాలు చలి గుప్పిట చిక్కుకున్నాయి. ప్రజలు చలికి గజగజ వణికిపోతున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో బయటకు రావాలంటేనే చలి తీవ్రతకు బయపడుతున్నారు. ఈ ఏడాదిలోనే అతితక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన జిల్లాల్లో కుమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ ముందున్నాయి. తాజాగా.. కుమురం భీం ఆసిఫాబాద్‌లోని గిన్నెధరిలో అత్యల్పంగా 6.1 డిగ్రీల సెల్సియస్‌ నమోదయింది. హైదరాబాద్‌ గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోనూ చలి తీవ్రత అధికంగా ఉంది. శేరిలింగంపల్లిలో 8.4 డిగ్రీల సెల్సియస్ రికార్డు స్థాయి కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న మూడు నుంచి నాలుగు రోజులు కూడా చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సాధారణ కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు తెలంగాణ వ్యాప్తంగా 20 జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. కుమురం భీం ఆసిఫాబాద్‌లోని గిన్నెధరి ప్రాంతంలో 6.1 డిగ్రీల సెల్సియస్‌ నమోదైనట్లు చెప్పారు. ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌లో 6.3 డిగ్రీల సెల్సియస్, సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలో 6.4 డిగ్రీల సెల్సియస్, వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేటలో 6.9 డిగ్రీల సెల్సియస్, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 7.6 డిగ్రీల సెల్సియస్, కామారెడ్డి జిల్లా బీబీపేటలో 7.9 డిగ్రీల సెల్సియస్, మెదక్‌ జిల్లా వెల్దుర్తిలో 8.1 డిగ్రీల సెల్సియస్, సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట- భూంపల్లిలో 8.2 డిగ్రీల సెల్సియస్, నిర్మల్‌ జిల్లా పెంబిలో 8.3 డిగ్రీల సెల్సియస్, నిజామాబాద్‌ జిల్లా కోటగిరిలో 8.4 డిగ్రీల సెల్సియస్, మహబూబ్‌నగర్‌ జిల్లా గండీడ్‌లో 8.6, రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో 8.7 డిగ్రీల సెల్సియస్, నారాయణపేట జిల్లా కోస్గిలో 8.9 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.