నెల్లూరులో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీకి నెల్లూరు కార్పొరేషన్‌లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కుర్చీని దక్కించుకోవాలని.. గత కొన్నిరోజులుగా ఎదురుచూస్తున్న టీడీపీకి.. ఆదిలోనే హంసపాదు తగిలింది. మేయర్ పీఠం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న తెలుగుదేశం పార్టీకి.. వైసీపీ కార్పొరేటర్లు షాక్ ఇచ్చారు. వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఆ ఐదుగురు కార్పొరేటర్లు.. తాజాగా మళ్లీ తమ సొంత పార్టీకి వెళ్లిపోవడంతో.. టీడీపీకి షాక్ తగిలింది. తాము వైఎస్సార్సీపీలోనే కొనసాగుతామని తేల్చి చెప్పారు. ప్రస్తుతం వైసీపీ చేతిలో ఉంది. నెల్లూరు నగర మేయర్ స్రవంతిపై ఈనెల 18వ తేదీన అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు టీడీపీ సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో.. నెల్లూరు కార్పొరేషన్ రాజకీయాల్లో ఊహించని మలుపు చోటు చేసుకుంది. గతంలో వైఎస్సార్‌సీపీ తరపున కార్పొరేటర్లుగా గెలిచి.. ఆ తర్వాత టీడీపీలోకి వెళ్లిన ఐదుగురు కార్పొరేటర్లు.. ఇప్పుడు తిరిగి వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతామని ప్రకటించడంతో అసలు చిక్కు వచ్చి పడింది.మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో కలిసిన ఈ ఐదుగురు నెల్లూరు కార్పొరేటర్లు.. ఆయన సమక్షంలోనే తమ నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అనిల్ కుమార్‌ యాదవ్‌.. ఎమ్మెల్సీ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్‌ రెడ్డి ఆ ఐదుగురు కార్పొరేటర్ల వెంట ఉన్నారు. నెల్లూరు కార్పొరేషన్‌లోని 6వ డివిజన్‌ కార్పొరేటర్ మద్దినేని మస్తానమ్మ, 5వ డివిజన్‌ కార్పొరేటర్ ఓబుల రవిచంద్ర, 51వ డివిజన్‌ కార్పొరేటర్ కాయల సాహితి, 16వ డివిజన్‌ కార్పొరేటర్ వేనాటి శ్రీకాంత్ రెడ్డి, 34వ డివిజన్‌ కార్పొరేటర్ షేక్‌ ఫమిదా.. తాజాగా మళ్లీ వైసీపీలోకి వచ్చారు. ఈ ఐదుగురు కార్పొరేటర్లకు స్వయంగా పార్టీ కండువాలు కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు.త్వరలోనే నెల్లూరు కార్పొరేషన్‌లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు టీడీపీ అన్ని వ్యూహాలు, ప్రతివ్యూహాలు చేస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. టీడీపీలోకి వెళ్లిన ఐదుగురు కార్పొరేటర్లు.. తిరిగి వైఎస్సార్‌సీపీలో చేరడంతో ఆ పార్టీకి నెల్లూరు కార్పొరేషన్‌లో బలాన్ని ఇచ్చింది. టీడీపీలోకి వెళ్లిన ఐదుగురు కార్పొరేటర్లు మళ్లీ సొంత గూటికి చేరుతున్నట్లు ప్రకటించడంతో.. అవిశ్వాసం పెట్టి మేయర్‌ను తొలగించాలని చూస్తున్న టీడీపీకి ఇది తాత్కాలికంగా బ్రేక్ వేసినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఈనెల 18వ తేదీన జరగనున్న అవిశ్వాస తీర్మానం ఎటు వైపు వెళ్తుందోననే ఉత్కంఠ ఇప్పుడు నెల్లూరుతోపాటు రాష్ట్ర రాజకీయాల్లో మరింత ఆసక్తిని పెంచింది.