తెలంగాణ రాష్ట్రంలోని పదో తరగతి (10th Class) విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంగళవారం అధికారికంగా విడుదల చేసింది. 2025-2026 విద్యా సంవత్సరం పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 14వ తేదీ నుంచి ప్రారంభమై ఏప్రిల్ 13వ తేదీ వరకు కొనసాగుతాయని ప్రకటించారు.పరీక్షల తేదీలను నిర్ణయించడంలో విద్యాశాఖ ఈసారి ఒక కీలక మార్పును తీసుకొచ్చింది. విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు వీలుగా.. ప్రతి పరీక్షకు మధ్య 4 రోజుల గ్యాప్‌ ఉండేలా షెడ్యూల్‌ను రూపొందించారు. విద్యార్థులు ఒక పరీక్ష ముగిసిన తర్వాత తదుపరి పరీక్షకు సిద్ధం కావడానికి.. ముఖ్యంగా కఠినమైన సబ్జెక్టులను సమర్థవంతంగా రివిజన్ చేసుకోవడానికి ఈ గ్యాప్ ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 13 వరకు పూర్తయిన వెంటనే, మార్చి 14 నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.పరీక్ష నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు.. పదో తరగతి పరీక్షలు రాష్ట్ర స్థాయిలో అత్యంత ముఖ్యమైనవి కాబట్టి.. వాటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రశాంతంగా నిర్వహించడానికి విద్యాశాఖ చకాచకా ఏర్పాట్లు చేపడుతోంది. పరీక్షా కేంద్రాల వివరాలతో కూడిన హాల్ టికెట్లను సమయానికి అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షల షెడ్యూల్ విడుదలైనందున.. ఉపాధ్యాయులు సమయానికి సిలబస్‌ను పూర్తి చేయడానికి, విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు.. మంచినీరు, వైద్య సదుపాయాలు వంటి మౌలిక వసతులు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నారు. పరీక్షల అనంతరం.. తక్కువ సమయంలోనే ఫలితాలను ప్రకటించేందుకు అవసరమైన ప్రణాళికను కూడా సిద్ధం చేస్తున్నారు. తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఒక విద్యార్థి భవిష్యత్తును నిర్ణయించే కీలక ఘట్టం కాబట్టి.. విద్యార్థులు ఈ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని సమయాన్ని వృథా చేయకుండా చదువుపై దృష్టి సారించాలని విద్యా నిపుణులు సూచిస్తున్నారు.