తెలంగాణలో ఆ రంగానికి బంగారు బాట.. ఏకంగా రూ.7045 కోట్ల పెట్టుబడులు.. 40 వేల ఉద్యోగాలు..

Wait 5 sec.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పర్యాటక రంగానికి బంగారు బాటలు వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో.. ఈ రంగంలో ఏకంగా రూ. 7,045 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన కీలక ఒప్పందాలు కుదిరాయి. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40,000 కొత్త ఉద్యోగాలు..10,000 ప్రత్యక్ష ఉద్యోగాలు, 30,000 పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. తెలంగాణను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చాలనే లక్ష్యానికి ఈ పెట్టుబడులు బలాన్ని చేకూర్చనున్నాయి.ఈ పెట్టుబడులు ఆతిథ్యం, వినోదం, ఆరోగ్యం, సాంస్కృతిక మౌలిక వసతులు, సాహస పర్యాటకం వంటి అనేక విభాగాల్లో కేంద్రీకృతమయ్యాయి. ఫుడ్‌లింక్ ఎఫ్ అండ్ బి హోల్డింగ్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ భారత్ ఫ్యూచర్ సిటీలో సమగ్ర అంతర్జాతీయ కన్వెన్షన్, ట్రేడ్ & ఎగ్జిబిషన్ సెంటర్ కోసం రూ. 3,000 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. అలాగే.. కేఈఐ గ్రూప్ గాంధీపేట సమీపంలో రూ. 200 కోట్లతో గ్లాస్‌హౌస్-గ్రీన్‌హౌస్ కన్వెన్షన్ కేంద్రాన్ని అభివృద్ధి చేయనుంది.టర్కీకి చెందిన పాలిన్ గ్రూప్, మల్టీవర్స్ హోటల్స్ కలిసి హైదరాబాద్‌లో రూ. 300 కోట్లతో ప్రపంచ స్థాయి ఆక్వా మెరైన్ పార్క్ , ఆక్వా టన్నెల్‌ను నిర్మించనున్నాయి. స్పెయిన్‌కు చెందిన ఫ్లూయిడ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రూ. 300 కోట్లతో కృత్రిమ బీచ్, లగూన్ & రిసార్ట్ ప్రాజెక్టును అభివృద్ధి చేయనుంది. డ్రీమ్‌వ్యాలీ గోల్ఫ్ అండ్ రిసార్ట్స్ భారత్ ఫ్యూచర్ సిటీలో రూ. 1,000 కోట్లతో ప్రపంచ స్థాయి గోల్ఫ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుండగా.. సారస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అదే ప్రాంతంలో రూ. 1,000 కోట్లతో అంతర్జాతీయ సాంస్కృతిక కేంద్రాన్ని స్థాపించనుంది.మాల్దీవులకు చెందిన అట్మాస్పియర్ కోర్ హోటల్స్ రూ. 800 కోట్లతో హైదరాబాద్‌లో విలాసవంతమైన అంతర్జాతీయ వెల్‌నెస్ రిట్రీట్‌ను ఏర్పాటు చేయనుంది. పెట్టుబడులతో పాటు, పర్యాటక రంగాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడానికి పలు వ్యూహాత్మక ఒప్పందాలు కూడా కుదిరాయి. టోనీ బ్లెయిర్ ఇన్‌స్టిట్యూట్ (లండన్).. పర్యాటక రంగాన్ని వేగవంతం చేయడానికి, ప్రపంచ స్థాయిలో తెలంగాణ స్థానాన్ని బలోపేతం చేయడానికి వ్యూహాత్మక సలహా సహకారాన్ని అందించనుంది.ఐఐఎఫ్‌ఏ ఉత్సవం, ఏథెన్స్ ఈవెంట్ల భాగస్వామ్యం ద్వారా సుమారు రూ. 550–600 కోట్ల ఆర్థిక ప్రభావం పడుతుందని అంచనా. ఆస్ట్రేలియాకు చెందిన సలామ్ నమస్తే దోస హట్ సంస్థ కార్వాన్ పార్కులను అభివృద్ధి చేయడం ద్వారా సాహస, ఎకో-పర్యాటకాన్ని ప్రోత్సహించనుంది. ఆసియాన్ (ASEAN) రాయబారులతో, పర్యాటక మంత్రిత్వ శాఖలతో సాంస్కృతిక సహకారం ద్వారా తెలంగాణ బౌద్ధ సర్క్యూట్‌లను ఆసియాన్ దేశాలలో ప్రచారం చేయనున్నారు.