Anant Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, అపర కుబేరుడు ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీకి అరుదైన గౌరవం లభించింది. అమెరికాకు చెందిన గ్లోబల్ హ్యూమన్ సొసైటీ అనంత్ అంబానీకి గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డును ప్రదానం చేసింది. వంతారా పేరుతో వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తూ వన్య ప్రాణుల సంరక్షణ కోసం చేస్తున్న కృషిని గుర్తిస్తూ ఆయనకు ఈ అవార్డును అందజేశారు. అంతే కాదు ఆసియాకు చెందిన మొట్ట మొదటి వ్యక్తిగానూ నిలిచారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన ఈ కార్యక్రమంలో అనంతం అంబానీకి గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డును హ్యూమన్ సొసైటీ ప్రదానం చేసింది. వన్య ప్రాణుల సంరక్షణలో అత్యంత ప్రముఖంగా భావించే ఈ అవార్డు అనంత్ అంబానీకి దక్కడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటి వరకు షెర్లే మెక్‌లైన్, జాన్ వేన్, బ్రెట్టీ వైట్ వంటీ ప్రముఖ నటులను ఈ అవార్డు వరించింది. వంతారాను స్థాపించి వన్య ప్రాణులపై ఆయనకు ఉన్న ప్రేమ, కరుణను చూపిస్తున్నందుకు గానూ అనంత్ అంబానీకి ఈ అవార్డ్ లభించిందని చెప్పవచ్చు. వైద్యం అందించడంలో అనంత్ అంబానీ అంకిత భావం కనిపిస్తున్నట్లు గ్లోబల్ హ్యూమన్ సొసైట్ ప్రెసిడెంట్, సీఈఓ డాక్టర్ రాబిన్ గాంజెర్ట్ పేర్కొన్నారు. వంతారా ద్వారా అనంత్ అంబానీ ఓ బెంచ్ మార్క్ సృష్టించారని ఆమె కొనియాడారు. వన్య ప్రాణుల సంరక్షణకు ఎంతో పాటుపడుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అనంత్ అంబానీ మాట్లాడుతూ.. 'ఈ గౌరవం దక్కినందుకు గ్లోబల్ హ్యూమన్ సొసైటీకి ప్రత్యేక కృతజ్ఞతలు. నాకు, ఇది సర్వభూత హిత అనే కాలాతీత సూత్రాన్ని, అన్ని జీవుల శ్రేయస్సును పునరుద్ఘాటిస్తుంది. జంతువులు మనకు సమతుల్యత, వినయం, నమ్మకాన్ని బోధిస్తాయి. వంతారా ద్వారా ప్రతి జీవితానికి గౌరవం, శ్రద్ధ, ఆశను అందించడం మా ఉద్దేశం' అని పేర్కొన్నారు.