బీఆర్ఎస్ నేత ప్రాణం తీసిన సర్పంచ్ ఎన్నికలు.. ఆధిపత్య పోరులో..

Wait 5 sec.

తెలంగాణలో అయినప్పటి నుంచి పల్లెల్లో సందడి వాతావారణం నెలకొంది. అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారాలు నిర్విహించి ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సర్పంచ్ ఎన్నికలతో రాజకీయ పార్టీలకు సంబంధం లేకున్నా.. అభ్యర్థులను బలపరిచి బరిలోకి దింపుతున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామాల్లో పార్టీలు బలపరిచిన అభ్యర్థుల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. దీంతో రాజకీయాలు వెడెక్కుతున్నాయి. ఈ అధిపత్య పోరు ఓ బీఆర్ఎస్ నేత ప్రాణం తీసింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నూతనకల్‌ మండలం లింగంపల్లిలో చోటుటేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపల్లి గ్రామ పంచాయతీ స్థానం ఎస్సీ జనరల్‌కు రిజర్వు అయ్యింది. బీఆర్‌ఎస్‌ మద్దతుదారుగా మాదాసు వెంకన్న అనే వ్యక్తిని సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచింది. ఇక కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారుడిగా దేశపంగు మురళి సర్పంచ్‌ బరిలో నిలిచారు. ఇదే గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ నేత ఉప్పుల మల్లయ్య కోడలు ఉప్పుల శైలజ.. 4వ వార్డు నుంచి బీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థిగా బరిలో ఉంది. మంగళవారం (డిసెంబర్ 9) రాత్రి 11 గంటల సమయంలో ఇరు పార్టీలు బలపరిచిన అభ్యర్థులు ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో శైలజ ప్రత్యర్థి ఆకుల రజిత వర్గానికి చెందిన వారు.. గ్రామంలోని పార్టీల జెండా దిమ్మెల సమీపంలో కూర్చున్నారు. అదే సమయంలో శైలజ వర్గం వారు అక్కడికి వచ్చారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుటేసుకుంది. ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం.. తీవ్ర స్థాయికి చేరి కర్రలు, రాళ్లతో పరస్పరం దాడికి దిగారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు మున్నా మల్లయ్యపై దాడి చేయడానికి వస్తున్న వారిని.. అడ్డుకోవడానికి ఉప్పుల మల్లయ్య వెళ్లాడు. దీంతో అతడిపై కూడా కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడి కిందపడిపోయిన మల్లయ్యపై బండరాయితో దాడి చేయడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. వెంటనే అప్రమత్తమైన అతడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు.. అంబులెన్స్‌లో సూర్యపేట ఆసుపత్రికి.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. అయితే అప్పటికే మల్లయ్య మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు. మల్లయ్యతోపాటు అతడి సోదరుడు లింగయ్య, మరో ముగ్గురిపై కూడా దాడులు జరిగినట్లు తెలుస్తోంది.ఉప్పుల మల్లయ్య మృతదేహానికి సూర్యాపేట ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి.. భారీ పోలీస్‌ బందోబస్తు మధ్య గ్రామంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే రాజకీయ కక్షలతోపాటు దాయాదుల మధ్య ఉన్న పాత గొడవలు కూడా ఈ దాడికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఇప్పటివరకు 8 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.