జపాన్‌లో అత్యంత శక్తివంతమైన భారీ సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై ఈ భూకంపం తీవ్రత 7.2గా నమోదైనట్లు జపాన్ వాతావరణ సంస్థ ప్రకటించింది. దీంతో వెంటనే ఆ ప్రాంతంలో సునామీ హెచ్చరికలను జారీ చేశారు. ఉత్తర తీరంలోని హొక్కైడో తీరం వెంబడి 7.2 తీవ్రతతో ఈ భారీ భూకంపం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ భూకంప కేంద్రం సముద్ర ఉపరితలం నుంచి.. 50 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు తెలిపారు. జపాన్‌లో భూకంప తీవ్రత దృష్ట్యా.. అమోరి, హొక్కైడో తీర ప్రాంతాల్లో 3 మీటర్లు (సుమారు 10 అడుగుల) ఎత్తు వరకు సునామీ అలలు విరుచుకుపడే అవకాశాలు ఉన్నాయని జపాన్ వాతావరణ సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతాల్లోని అణు విద్యుత్ కేంద్రాల్లో భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జపాన్ అధికారులు తెలిపారు.భూకంప కేంద్రం, దాని తీవ్రతకు సంబంధించిన వివరాలను జపాన్ వాతావరణ సంస్థ వెల్లడించింది. హొక్కైడో తీరానికి దూరంగా అమోరి తీరప్రాంత నగరం సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎమర్జెన్సీ హెచ్చరికలు జారీ చేశారు. సునామీ హెచ్చరికల నేపథ్యంలో అక్కడ ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.