టీమిండియా మహిళా క్రికెటర్ తిరిగి ప్రాక్టీస్ ప్రారంభించింది. మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్చల్‌తో పెళ్లి రద్దు చేసుకున్నట్లు ఆదివారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన మంధాన.. ఒక్క రోజు వ్యవధిలోనే తిరిగి బ్యాట్ పట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోను స్మృతి మంధాన సోదరుడు శ్రవణ్‌ మంధాన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్టు చేశారు. ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.ఈ ఏడాది భారత్ వేదికగా జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఛాంపియన్‌గా నిలవడంలో మంధాన కీలకపాత్ర పోషించింది. ఇక ఈ నెల 21 నుంచి 30 వరకు శ్రీలంకతో టీమిండియా మహిళల జట్టు ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌ కోసమే మంధాన తిరిగి బ్యాట్ పట్టింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన అభిమానులు.. ‘స్మృతి మంధాన ఈజ్‌ బ్యాక్‌’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్‌ల వివాహం నవంబర్ 23న జరగాల్సి ఉంది. పెళ్లి వేడుకల్లో భాగంగా హల్దీ, మెహందీ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. టీమిండియా మహిళా క్రికెటర్లలో పలువు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. అయితే ముహూర్తానికి కొన్ని గంటల ముందు.. మంధాన తండ్రి శ్రీనివాస్ గుండెపోటుకు గురయ్యారు. ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అదే రోజు పలాష్ ముచ్చల్ కూడా అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. దీంతో పెళ్లిని కొన్ని రోజుల పాటు వాయిదా వేసినట్లు ఇరు కుటుంబాలు ప్రకటించాయి.అయితే ఆదివారం స్మృతి మంధాన సోషల్ మీడియాలో ఓ కీలక ప్రకటన చేసింది. ఇందులో తమ వివాహం రద్దు అయినట్లు తెలిపింది. ఇకపై తన ఫోకస్ మొత్తం.. క్రికెట్‌పైనే పెడతానని ఆ పోస్టులో పేర్కొంది. దేశానికి మరిన్ని ట్రోఫీలో అందించడంపైనే తాను దృష్టి సారిస్తానని వెల్లడించింది. చెప్పినట్లుగానే బ్యాట్ తిరిగి పట్టింది స్మృతి మంధాన..