తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి '' వేదికగా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన తమ బృహత్తర విజన్‌ను ఆవిష్కరించారు. 2047 నాటికి తెలంగాణను గ్లోబల్ పవర్‌హౌస్‌గా మార్చాలన్న లక్ష్యంతో.. తమ పోటీ చైనా, జపాన్ వంటి అభివృద్ధి చెందిన దేశాలతో ఉందని సీఎం ప్రకటించారు. ముఖ్యంగా.. చైనాలోని గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ 20 ఏళ్లుగా అత్యధిక పెట్టుబడులతో పాటు.. ఉత్పత్తిలో చైనాను లీడ్ చేస్తుందన్నారు. ఇదే పట్టణం తెలంగాణకు ఆదర్శం అన్నారు. అభివృద్ధికి త్రి-జోన్ వ్యూహం: 'క్యూర్‌, ప్యూర్‌, రేర్‌'.. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని వికేంద్రీకరించేందుకు రూపొందించిన 'తెలంగాణ రైజింగ్- 2047' విజన్ డాక్యుమెంట్‌ను సదస్సులో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రణాళికలో భాగంగా రాష్ట్రాన్ని మూడు ప్రధాన ఆర్థిక జోన్లుగా విభజించారు:క్యూర్‌ (CURE - Core Urban Region Economy).. ఔటర్ రింగ్ రోడ్డు (ORR) లోపలి ప్రాంతం. ఇది పట్టణ కేంద్రంగా, సాంకేతిక , వాణిజ్య కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది. ప్యూర్‌ (PURE - Peri Urban).. ఓఆర్‌ఆర్‌ , కొత్తగా నిర్మించనున్న ట్రిపుల్ ఆర్ మధ్య ప్రాంతం. ఇది సెమీ-అర్బన్ జోన్‌గా.. లాజిస్టిక్స్, ఉపగ్రహ నగరాల అభివృద్ధికి తోడ్పడుతుంది.రేర్‌ (RARE - Rural Agricultural).. ట్రిపుల్ ఆర్ అవతలి ప్రాంతం నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు. ఇది గ్రామీణ, వ్యవసాయ అభివృద్ధికి, ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తుంది. ఈ విజన్ డాక్యుమెంట్‌ను మహిళలు, రైతులు, యువతతో సహా అన్ని సామాజిక వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని తయారుచేసినట్లు సీఎం తెలిపారు.గ్లోబల్ సమ్మిట్ అజెండా..కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, నోబెల్ గ్రహీత కైలాశ్ సత్యార్థి వంటి ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్రంలోని అపారమైన అవకాశాలను ప్రపంచానికి వివరించి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులను సాధించడమే సమ్మిట్ ప్రధాన అజెండాగా ఉంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం కేవలం పెట్టుబడులు ఆకర్షించడానికి మాత్రమే కాకుండా.. తమ విజన్ ఏంటో ప్రపంచానికి వివరించడానికి ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తోందని తెలిపారు. విద్యుత్ సంస్కరణలు వంటి అనేక సంస్కరణలు తీసుకురాబోతున్నామని.. విజన్‌కు సహకరించాలని విపక్షాలను కోరుతున్నామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పేలా.. అత్యంత ఆధునిక హంగులతో, రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ సమ్మిట్ ఏర్పాట్లు జరిగాయి.ఇదిలా ఉండగా.. ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌'లో తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల విలువైన భారీ ఎంవోయూలు (MOU) కుదిరాయి. ముఖ్యంగా డీప్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ వంటి కీలక రంగాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. డీప్ టెక్నాలజీ రంగంలో అత్యధికంగా రూ.75 వేల కోట్లు, గ్రీన్ ఎనర్జీ, పునరుత్పాదక రంగాల్లో కలిపి రూ.66,700 కోట్లు.. ఏరోస్పేస్, డిఫెన్స్‌లో రూ.19,350 కోట్ల మేర ఒప్పందాలు కుదిరాయి. ఈ పెట్టుబడులు రాష్ట్ర అభివృద్ధికి, యువతకు ఉపాధి కల్పనకు దోహదపడతాయని ప్రభుత్వం తెలిపింది.