సీటు మారి చావు తప్పించుకున్న చిన్నారి.. ఒక్క నిమిషం వ్యవధిలోనే, చేవెళ్ల విషాదంలో విధి ఆడిన వింత నాటకం..!

Wait 5 sec.

రంగారెడ్డి జిల్లా తెలంగాణలో విషాదం నింపిన సంగతి తెలిసిందే. సోమవారం (నవంబర్ 3) ఉదయం 7 గంటల ప్రాంతంలో తాండూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సును కంకర లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టింది. లారీలోని కంకర బస్సులోని ప్రయాణికులపై పడిపోవటంతో వారు సజీవ సమాధి అయ్యారు. టిప్పర్, బస్సు డ్రైవర్ సహా మెుత్తం 19 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మంది గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆ సమయంలో బస్సులో 70 మంది ఉండగా.. 17 మంది సురక్షితంగా బయటపడ్డారు. రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద బస్సు ప్రమాదాల్లో ఒకటిగా చేవెళ్ల మీర్జాగూడ బస్సు ప్రమాదం నిలిచింది. అయితే ఈ బస్సు ప్రమాదంలో ఓ ఐదేళ్ల చిన్నారి తృటిలో చావు నుంచి తప్పించుకున్నాడు. అప్పటి వరకు తల్లి వద్ద కూర్చున్న బాలుడు.. ఎవరో పిలిచినట్లు మరో చోట కూర్చున్న తండ్రి వద్దకు వెళ్లి ప్రాణాలతో బయటపడ్డాడు. నిమిషం వ్యవధిలోనే ఈ పరిణామం చోటు చేసుకోగా.. తల్లి మరిణించింది. వివరాల్లోకి వెళితే.. తాండూరుకు చెందిన అబ్దుల్ మాజీద్‌కు భార్య, ముగ్గురు పిల్లలు. అనారోగ్యంతో ఉన్న తన భార్యను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తీసుకెళెళ్లేందుకు బస్సును ఎక్కాడు. మాజీద్ భార్య, ఐదేళ్ల చిన్న కొడుకును కూర్చోబెట్టారు. తాను మాత్రం ఎనిమిదేళ్ల పెద్ద కొడుకు, ఆరేళ్ల కూతురుతో కలిసి బస్సు వెనుక సీట్లలో కూర్చున్నారు. బస్సు వేగంగా ప్రయాణిస్తున్న తరుణంలో.. ప్రమాదానికి సరిగ్గా ఒక్క నిమిషం ముందు చిన్న కొడుకు ఎవరో పిలిచినట్లుగా తల్లి వద్ద నుంచి లేచి తండ్రి దగ్గరకు వచ్చి వెనుక సీట్లో కూర్చున్నాడు.ఆ తర్వాతి నిమిషానికే దురదృష్టవశాత్తూ.. అతివేగంతో వచ్చిన టిప్పర్ లారీ బస్సు ముందు భాగాన్ని ఢీకొట్టడంతో ముందు సీట్లలో కూర్చున్న అబ్దుల్ మాజీద్ భార్య తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మరణించారు. అయితే ఒక్క నిమిషం ముందు సీటు మారిన చిన్న కొడుకు సహా తండ్రి, ముగ్గురు పిల్లలు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇలా ఐదేళ్ల చిన్నారి సీటు మారి ప్రాణాలతో బయటపడగా.. తల్లి మాత్రం ప్రాణాలు కోల్పోయింది.