ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న జిల్లాల విభజనలో కొన్ని మార్పులు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఆయా జిల్లాల నుంచి వచ్చిన రిక్వెస్ట్‌లను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని నియోజకవర్గాలను పొరుగున ఉండే జిల్లాలో విలీనం దిశగా అడుగులుపడుతున్నాయి. ఈ క్రమంలో తెరపైకి వచ్చింది. గన్నవరం, నూజివీడు నియోజకవర్గాలను ఎన్టీఆర్‌ జిల్లాలో, కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలపాలని ప్రతిపాదనల్ని మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడలో భాగంగా ఉన్న పెనమలూరు నియోజకవర్గాన్ని మాత్రం కృష్ణా జిల్లాలోనే కొనసాగించనున్నారు. ఇప్పటికే రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయి. మార్కాపురం, మదనపల్లెలను కొత్త జిల్లాల కేంద్రాలుగా చేయాలని నిర్ణయించారు. వీటితో పాటు, పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకశిర కేంద్రాలుగా కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై మరిన్ని ప్రతిపాదనలు తాజాగా తెరపైకి వచ్చాయి. ఈ ప్రతిపాదనలన్నింటినీ బుధవారం సచివాలయంలో జరిగే మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో చర్చిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని రెవెన్యూ డివిజన్లలో మార్పులు, చేర్పులపై కూడా చర్చించి, ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. ఈ సిఫారసులను సీఎం చంద్రబాబు వద్ద మరోసారి చర్చిస్తారు. అనంతరం, 10వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనలపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ పునర్వ్యవస్థీకరణతో పరిపాలన మరింత సులభతరం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.రాష్ట్రంలో రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం పునరాలోచిస్తోంది. ఒక నియోజకవర్గంలోని మండలాలన్నీ ఒకే రెవెన్యూ డివిజన్‌లో ఉండేలా చూడాలనే అంశంపై పునరాలోచిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున మార్పులు, చేర్పులు చేయాల్సి ఉండటంతో.. అన్నిటినీ పరిశీలించి పరిష్కరించే సమయం కూడా ఇప్పుడు లేదు. జనగణన నేపథ్యంలో డిసెంబరు నెలాఖరులోగా ఈ ప్రక్రియ ముగించాలి. వైకాపా ప్రభుత్వ హయాంలో సమగ్ర కసరత్తు లేకుండానే హడావుడిగా విభజన చేయడంతో సమస్యలు వెంటాడుతున్నాయి. అలాంటి తప్పు మరోసారి చేయకూడదని.. పాలనా సౌలభ్యం, ప్రజల ఆకాంక్షల మేరకే శాస్త్రీయంగా విభజన జరగాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఎలాగూ ముందుముందు నియోజకవర్గాల పునర్విభజన కూడా జరగనుంది. తర్వాతే వాటికి అనుగుణంగా రెవెన్యూ డివిజన్లను సర్దుబాటు చేయొచ్చని ఆలోచిస్తోంది.