మహమ్మద్ షమీ టెస్ట్‌ కెరీర్ ముగిసినట్లేనా..!

Wait 5 sec.

భారత్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండు మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత సెలెక్టర్లు బుధవారం జట్టును ప్రకటించారు. ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో గాయపడ్డ రిషభ్ పంత్‌ ఈ సిరీస్ ద్వారా పునరాగమనం చేయనున్నాడు. అయితే దేశవాళీ క్రికెట్‌లో సత్తాచాటుతున్నప్పటికీ వెటరన్ పేసర్ మహమ్మద్ షమీని మాత్రం సెలక్టర్లు పక్కనపెట్టారు. దీంతో రెడ్‌ బాల్ క్రికెట్‌లో అతడి భవిష్యత్‌పై కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జూలైలో మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్ సందర్భంగా పాదానికి గాయమైన పంత్, పూర్తిగా కోలుకున్నాడు. వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు దూరమైనప్పటికీ దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఎన్‌.జగదీషన్ ప్లేసులో జట్టులోకి వచ్చాడు. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు నవంబర్ 14న కోల్‌కతాలో ప్రారంభం కానుంది. నవంబర్ 22 నుంచి గువహటిలో రెండో మ్యాచ్ జరుగుతుంది. షమీకి దారులు మూసుకుపోయినట్లేనా..దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు షమీని ఎంపిక చేయకపోవడంతో.. అతడి టెస్ట్ కెరీర్‌ ముగిసినట్లేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 34 ఏళ్ల షమీ.. ఫిట్‌గా, ఫామ్‌లో ఉన్నప్పటికీ భారత సెలక్టర్లు ఎంపిక చేయట్లేదు. ఇంగ్లాండ్, వెస్టిండీస్ తాజాగా దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లకు అతడి దూరం పెట్టారు. షమీ చివరిసారిగా 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లోనూ ఆడాడు. కానీ ఐపీఎల్ 2025లో ఆశించిన మేర రాణించలేకపోయాడు. అప్పటి నుంచి భారత జట్టుకు దూరమయ్యాడు. ఇటీవల దేశవాళీ క్రికెట్‌లో షమీ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. బెంగాల్ తరఫున మూడు రంజీ మ్యాచ్‌లలో 15 వికెట్లు పడగొట్టాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో ఫైఫర్ నమోదు చేశాడు. అయినప్పటికీ దక్షిణాఫ్రికా ఏతో తలపడే ఇండియా-ఏ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. కానీ గాయం నుంచి కోలుకున్న ఆకాశ్ దీప్ మాత్రం టీమిండియాకు ఎంపికయ్యాడు. దీన్ని బట్టి చూస్తే.. షమీ.. భారత టెస్ట్ జట్టు ప్రణాళికల్లో లేడనే విశ్లేషణలు వస్తున్నాయి. మరి షమీకి మళ్లీ టెస్ట్ జట్టు నుంచి పిలుపువస్తుందా? లేదా అన్నది తేలాల్సి ఉంది.