హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో దొంగల ముఠా మరోసారి రెచ్చిపోయింది. దుండిగల్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత పకడ్బందీగా ప్రణాళిక వేసి.. ఓ నగల దుకాణం గోడకు కన్నం వేసి ఏకంగా 15 కిలోల విలువైన వెండి ఆభరణాలు, సామగ్రిని ఆగంతకులు దోచుకెళ్లారు. అద్దె పేరుతో పక్క దుకాణంలో దిగి ఆ తర్వాత సంఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. మోతుకూరి సోమేశ్వర్ అనే వ్యక్తి బౌరంపేట కీర్తిహోమ్స్‌లో నివాసం ఉంటున్నాడు. ఆయన తన ఇంటికి సమీపంలోని పెట్రోల్‌బంక్‌ ఎదురుగా ఉన్న షాపింగ్‌ కాంప్లెక్స్‌లో ఒక షట్టర్‌ను అద్దెకు తీసుకుని సోమేశ్వర జ్యువెలరీ పేరుతో దుకాణం నిర్వహిస్తున్నాడు. శుక్రవారం రాత్రి 8.45 గంటలకు సోమేశ్వర్ దుకాణాన్ని మూసివేసి ఇంటికి వెళ్లాడు. శనివారం ఉదయం ఆయన వద్ద పనిచేసే అరుణ్‌ కుమార్ షాపు తెరవడానికి రాగా.. లోపల దృశ్యం చూసి షాక్‌ అయ్యాడు. దుకాణం లోపలి గోడకు పెద్ద రంధ్రం చేసి ఉంది. అంతేకాకుండా, షోకేసులలో ఉంచిన సుమారు 15 కిలోల వెండి ఆభరణాలు, ఇతర వెండి వస్తువులు కనిపించకపోవడంతో వెంటనే యజమానికి సమాచారం అందించాడు. కాగా, దొంగలు ఈ చోరీని అత్యంత పకడ్బందీగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. వారి దుకాణానికి పక్కనే ఉన్న పూజా స్టోర్ షట్టర్‌ను వారం రోజుల క్రితమే మూసివేశారు. రెండు రోజుల ముందు.. ఒక అగంతకుడు వచ్చి ఆ పక్క షట్టర్‌ను అద్దెకు తీసుకుంటానని చెప్పి, యజమానికి అడ్వాన్స్‌గా రూ.10 వేలు కూడా ఇచ్చాడు. సరిగ్గా అదే పక్క దుకాణం నుంచి గోడకు కన్నం వేసి, దొంగలు తమ పని కానిచ్చారు. ఈ విధానం చూస్తుంటే.. దొంగల ముఠా ఆ ప్రాంతంలో కనీసం వారం రోజుల ముందే రెక్కీ నిర్వహించి, ఈ దొంగతనానికి పథకం రచించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.దొంగలు ఎంత పకడ్బందీగా వ్యవహరించారంటే.. చోరీ అనంతరం దుకాణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల డీవీఆర్, హార్డ్‌డిస్క్‌లను కూడా తమతో తీసుకెళ్లారు. దీంతో దొంగతనానికి సంబంధించిన ఎలాంటి ఫుటేజీ దొరకకుండా జాగ్రత్త పడ్డారు. ఘటన గురించి తెలుసుకున్న వెంటనే మేడ్చల్ ఏసీపీ శంకర్‌రెడ్డి, డీఐ బాల్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్‌ను, డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించి సాక్ష్యాలను సేకరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఆ పక్క షట్టర్‌ను అద్దెకు తీసుకున్న వ్యక్తి కోసం, దుండగుల కోసం దర్యాప్తు ముమ్మరం చేశారు.