మెగాస్టార్ , నయనతార జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మన శంకర వరప్రసాద్ గారు'. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి 'పండగకి వస్తున్నాం' అనేది ట్యాగ్ లైన్. దానికి తగ్గట్టుగానే సంక్రాంతి పండక్కి రిలీజ్ చేయాలని శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ అభిమానులను ఆకట్టుకుంది. 'మీసాల పిల్ల' అంటూ వదిలిన ఫస్ట్ సింగిల్ కి అనూహ్య స్పందన లభించింది. అయితే తాజాగా ఈ పాట మరో అరుదైన ఫీట్ సాధించినట్లు తెలుస్తోంది. 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాకి భీమ్స్ సిసిరీలియో సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. ఇది ఆయన కెరీర్ లోనే పెద్ద సినిమా కావడం, మెగాస్టార్ కి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో బెస్ట్ సాంగ్స్ ఇవ్వడానికి తనవంతు కృషి చేశారు. ఇందులో భాగంగా 'మీసాల పిల్ల' పాట వచ్చింది. దీనిపై మొదట్లో ట్రోలింగ్ జరిగినప్పటికీ, మెల్లగా జనాల్లోకి వెళ్లిపోయింది. గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే పలు రికార్డులు క్రియేట్ చేసిన ఈ సాంగ్.. యూట్యూబ్ లో ఓ మైలురాయి మార్క్ అందుకుంది.'మీసాల పిల్ల' పాట 50 మిలియన్ వ్యూస్ మార్క్ ని దాటింది. అంటే ఇప్పటి వరకూ యూట్యూబ్ లో ఈ పాటకి 5 కోట్లకి పైగా వ్యూస్ వచ్చాయి. అంతేకాదు గత మూడు వారాలుగా యూట్యూబ్ మ్యూజిక్ వీడియోలలో టాప్-10 ట్రెండింగ్ లోనే కొనసాగుతోంది. దీన్ని బట్టే ఈ పాట ఎంతగా వైరల్ అయిందనేది అర్థం అవుతోంది. మరోవైపు రీల్స్ లోనూ ఈ సాంగ్ దూసుకుపోతోంది. కచ్చితంగా ఇది 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాకి ప్లస్ అవుతుందని భావించవచ్చు.