: రిటైరైన ఉద్యోగులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. ఇటీవలే అమలులోకి తీసుకొచ్చిన ఫైనాన్స్ యాక్ట్ 2025 కింద ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు డియర్ నెస్ అలవెన్స్ (డీఏ), సెంట్రల్ పే కమిషన్ ప్రయోజనాలను ఆపేస్తున్నట్లు ఆ వార్తల సారాంశం. ఇందుకోసం కొత్త నిబంధనలు తీసుకొచ్చినట్లు పేర్కొన్నాయి. ఈ విషయంపై కేంద్రం తాజాగా క్లారిటీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ (PIB Fact Check) విభాగం రిటైరైన ఉద్యోగులకు డీఏ పెంపు, సీపీసీ ప్రయోజనాల కోత వార్తలపై స్పందించింది. ఆ ప్రచారాన్ని ఖండించింది. అలాంటి నిబంధనలు ఏవీ లేవని తేల్చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ ఖాతా వేదికగా ఓ పోస్ట్ చేసింది. ' ఫైనాన్స్ యాక్ట్ 2025 కింద డీఏ, పే కమిషన్ బెనిఫిట్స్ నిలిపి వేశారు అంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అసత్యం' అని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది. దుష్ప్రవర్తన కారణంగా తొలగించిన ప్రభుత్వ ఉద్యోగుల విషయంలోనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిలిచిపోతాయని పీఐబీ స్పష్టం చేసింది. ఆ మేర సీసీఎస్ (పెన్షన్) రూల్స్, 2021లోని రూల్ 37ను సవరించింది కేంద్రం. ఇదే విషయమై పీఐబీ ఈ ఏడాది 2025, మే నెలలో ఓ పత్రికా ప్రకటన సైతం విడుదల చేసింది. కాబట్టి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్ధమని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం క్లారిటీ ఇచ్చింది. రిటైర్మెంట్ తర్వాత సైతం వీటి ద్వారానే అధిక బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు డీఏ పెంపు, సీపీసీ ప్రయోజనాలు ఏమీ అందవని వార్తలు చక్కర్లు కొట్టడంతో చాలా మంది ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. కొత్త నిబంధనలు ఎలా ఉన్నాయని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో కేంద్రం క్లారిటీ ఇచ్చింది. కేవలం ఉద్యోగం నుంచి దుష్ప్రవర్తన కారణంగా తొలగించిన వారికే డీఏ పెంపు, సీపీసీ పెన్షన్ ప్రయోజనాలు ఉండవని స్పష్టం చేసింది. ఇతర ఉద్యోగులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేల్చేసింది. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు. ఎలాంటి చర్యలు లేకుండా సాధారణ ఉద్యోగ విరమణ చేసిన రిటైర్డ్ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, అన్ని బెనిఫిట్స్ నార్మల్‌‌గానే అందుతాయని కేంద్రం తెలిపింది.