రెండు ట్రక్కుల మధ్య నుజ్జునుజ్జయిన కారు.. 8 మంది మృతి.. భయానక దృశ్యాలు

Wait 5 sec.

మహారాష్ట్రలో నవంబరు 13 గురువారం సాయంత్రం ఘోర ప్రమాదం సంభవించింది.పుణేలోని నవాలే పూల్ ప్రాంతంలో కంటెయినర్ అదుపుతప్పి వాహనాలపై దూసుకెళ్లింది. వేగంగా వెళ్తున్న కంటెయినర్ బ్రేక్ విఫలం కావడంతో ముందున్న 20 నుంచి 25 వాహనాలను ఢీకొట్టింది. ముందు ఒక కారును ఢీకొట్టగా అది మరో కంటైనర్ మధ్య ఇరుక్కుపోయి నుజ్జునుజ్జు అయింది. దీంతో సీఎన్జీ కారు మంటల్లో చిక్కుకుంది. ప్రమాదంలో 8 మంది మరణించగా, 20 మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.గురువారం సాయంత్రం సతారా నుంచి ముంబైవైపు వెళ్తున్న కంటైనర్ అనేక వాహనాలను ఢీకొట్టింది. తొలుత కారును ఢీకొట్టగా ముందున మరో కంటైనర్ ఉండటంతో మధ్యలో ఇరుక్కుపోయింది. కారులోని CNG సిలిండర్ పేలి మంటలు చెలరేగాయి. దీంతో వెనుక కంటైనర్ కూడా మంటల్లో చిక్కుకుంది. కారులోపల ఉన్న ఐదుగురు, కంటైనర్‌లోని ఇద్దరు సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి మృతదేహాలను కారు నుంచి బయటకు తీశారు. ఈ ప్రమాదంలో 20 మంది గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని చికిత్స కోసం వివిధ ఆసుపత్రుల్లో చేర్పించారు. నవాలే వంతెనపై సెల్ఫీ పాయింట్ ఉన్న ప్రాంతంలో ఈ ట్రక్కు బ్రేకులు ఫెయిలై వాహనాలపైకి దూసుకెళ్లిందని అధికారులు తెలిపారు. ప్రమాద స్థలిలో తొక్కిసలాట చోటుచేసుకుంటున్న జరుగుతోన్న ప్రచారాన్ని డీసీపీ సంభాజీ కదమ్ తోసిపుచ్చారు. 'ప్రస్తుతం వాహనాల్లో చిక్కుకున్న వారిని రక్షించడమే ప్రాధాన్యత.. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తున్నాం... మృతదేహాలను బయటకు తీస్తున్నాం... మంటలు అదుపులోకి వచ్చాయి. రెండు పెద్ద వాహనాలను తొలగించడానికి క్రేన్లను రప్పించాం..ఈ ప్రమాదం వెనుక గల కారణాలను తరువాత పరిశీలిస్తాం’ అని డీసీపీ వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టామని ఆయన తెలిపారు. బ్రెక్ విఫలమైందా? నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందా? అనేది విచారణలో తెలుస్తుందని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయి.. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఘటనకు సంబంధించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.