బిహార్ రాజకీయాల్లో గత 2 దశాబ్దాలుగా ఏకఛత్రాధిపత్యం కొనసాగిస్తున్నారు. బిహార్‌ రాజకీయాలు అంటేనే కూటములతో కూడుకున్నవి. ఈ నేపథ్యంలోనే కూటములను మార్చడంలో.. నితీష్ కుమార్ పీహెచ్‌డీ చేశారు. బాగా అవపోసన పట్టేశారు. అందుకే గత 20 ఏళ్లుగా (2014 నుంచి 2015 వరకు ఒక ఏడాది మినహా) బిహార్ ముఖ్యమంత్రి కుర్చీలో నుంచి లేవడం లేదు. అయితే అధికారంలో ఏ కూటమి అయినా ఉండనీ.. ఎన్నికల్లో ఏ పార్టీకి అత్యధిక సీట్లు వచ్చినా సరే.. ముఖ్యమంత్రి మాత్రం నితీష్ కుమార్‌ కావడం బిహార్‌లో ఆనవాయితీగా వస్తోంది. అయితే ఎమ్మెల్యేగా పోటీ చేయకుండానే ఎమ్మెల్సీ పదవితో నితీష్ కుమార్ సీఎం సీటులో కూర్చుంటుండటం గమనార్హం. బీజేపీ, జేడీయూ చెరో 101 స్థానాల్లో పోటీ చేశాయి. మొత్తం 243 సీట్లు ఉండగా.. మిగిలిన 41 సీట్లను కూటమిలోని ఇతర పార్టీలకు కేటాయించాయి. ముఖ్యమంత్రి అవుతారనే వార్తలు వస్తున్నాయి. అయితే ఎన్డీఏ కూటమి మాత్రం.. తమ ముఖ్యమంత్రి అభ్యర్థి నితీష్ కుమార్ అని ఎక్కడా చెప్పకపోవడం గమనార్హం. మరోవైపు.. ఈసారి ఎలాంటి తీర్పు వస్తుందా అనేది బిహార్ మాత్రమే కాకుండా మొత్తం భారతదేశ ప్రజలు ఎదురుచూస్తున్నారు. తొలిసారి సీఎంగా నితీష్ కుమార్మొట్టమొదటిసారిగా నితీష్ కుమార్.. 2000 మార్చి 10వ తేదీన బిహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే సరైన మెజార్టీ లేకపోవడంతో 7 రోజుల్లోనే రాజీనామా చేశారు. ఆ తర్వాత పూర్తి స్థాయి మెజారిటీతో 2005 నవంబర్ 24వ తేదీన మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఇక బిహార్‌లో 2014 మే 20వ తేదీన ముఖ్యమంత్రిగా జితిన్ రామ్ మాంఝీ ప్రమాణ స్వీకారం చేయగా.. 278 రోజుల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2015 ఫిబ్రవరిలో మళ్లీ ముఖ్యమంత్రి కుర్చీని ఎక్కిన నితీష్ కుమార్ ఇప్పటివరకు కొనసాగుతూనే ఉన్నారు. నితీష్ కుమార్ చేసిన కూటముల మార్పులు2005 నుంచి సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో బీజేపీతో కలిసి ఎన్డీఏ కూటమిలోనే కొనసాగారు. కానీ 2013లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీని.. 2014 సార్వత్రిక ఎన్నికలకు ఎన్డీఏ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంతో నితీష్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో బీజేపీతో పొత్తును తెంచుకున్నారు. ఈ క్రమంలోనే 2015 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘట్‌బంధన్ (ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ పార్టీలతో) కలిసి పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ముఖ్యమంత్రి సీటులో నితీష్ కుమార్ కూర్చున్నారు. అయితే ఈ స్నేహం ఎక్కువ కాలం నిలవలేదు. 2017లో మహాఘట్‌బంధన్‌లో కీలకంగా ఉన్న రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో కూటమి నుంచి బయటికి వచ్చి.. తిరిగి బీజేపీతో జతకట్టి ఎన్డీఏ మద్దతుతో మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎన్డీఏ కూటమిలో భాగంగానే పోటీ చేసి గెలిచి.. మళ్లీ సీఎం అయ్యారు. ఇక బీజేపీ తమ జేడీయూ పార్టీని బలహీనపరిచేందుకు ప్రయత్నాలు చేస్తోందంటూ నితీష్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో 2022లో ఎన్డీఏను వీడి.. తిరిగి కాంగ్రెస్, ఆర్జేడీలతో కలిసి మహాఘట్‌బంధన్‌లో చేరి.. మరోసారు ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. ఇక ఎన్డీఏ వైపు చూసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని 2024 సార్వత్రిక ఎన్నికల్లో గద్దె దింపాలనే లక్ష్యంతో ఇండియా కూటమిని బలోపేతం చేసే ప్రయత్నాలు చేశారు. అయితే ఇండియా కూటమిలో సీట్ల పంపకం, పార్టీల మధ్య సమన్వయం లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నితీష్ కుమార్ 2014 లోక్‌సభ ఎన్నికల ముందు.. ఇండియా కూటమికి షాక్ ఇస్తూ.. తిరిగి ఎన్డీఏ గూటికి చేరారు. ఈ క్రమంలోనే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలోని బీజేపీ సొంతంగా మెజార్టీ స్థానాలు దక్కించుకోకపోవడంతో.. నితీష్ కుమార్ కింగ్ మేకర్ అయ్యారు. జేడీయూ మద్దతుతో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో భాగంగానే 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ప్రస్తుతం ఎన్డీఏలో జేడీయూ కీలక పార్టీగా ఉండటంతో తిరిగి కుర్చీ నితీష్ కుమార్‌కే దక్కే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయకుండానే సీఎంగా కొనసాగింపుఇన్నేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నితీష్ కుమార్.. ఎప్పుడూ ఎమ్మెల్యేగా పోటీ చేయకపోవడం గమనార్హం. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కొత్తలో 1977, 1980, 1985 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో హర్నాట్ నియోజకవర్గం నుంచి 3 పోటీ చేశారు. అందులో 1985లో మొట్టమొదటిసారి విజయం సాధించి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత చాలా కాలం పాటు బార్హ్, నలంద స్థానాల నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించి ఎంపీగా పార్లమెంటులో అడుగుపెట్టారు. 2005లో ముఖ్యమంత్రిగా పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి.. ఆ తర్వాత జరిగిన ఏ అసెంబ్లీ ఎన్నికల్లోనూ (2010, 2015, 2020) నితీష్ కుమార్ నేరుగా ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా ఎమ్మెల్సీగా ఎన్నికై సీఎంగా కొనసాగుతున్నారు. మరోవైపు.. 2000 నుంచి 2024 వరకు మొత్తం 9 సార్లు బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయడం విశేషం.